సీఎస్ సోమేశ్ కుమార్ నియామకంపై హైకోర్టు తీర్పును బీజేపీ స్వాగతిస్తోందని ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు. ఆయనతో వ్యక్తిగతంగా బీజేపీకి ఎలాంటి వైరుధ్యం లేదని చెప్పారు. కానీ మొదటి నుంచి ఆయన ఏపీ క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారి కావడంతో.. తెలంగాణకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు వివక్షకు గురవుతున్నారని చెప్పారు. సోమేశ్ నియామకంపై తాను పలుమార్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని రఘునందన్ గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారిని సీఎస్‌గా నియమించాలని రఘునందన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆలస్యమైనా మంచి నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా కేంద్రం ఆదేశాలను పాటించాలని రఘునందన్ రావు సూచించారు. ధరణి విషయంలో సోమేశ్ కుమార్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. మరోవైపు తాత్కాలిక డీజీపీ అంజనీ కుమార్ నియామకం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని రఘునందన్ రావు సూచించారు.