ఎన్నికలొచ్చినప్పుడే కేసీఆర్​కు పథకాలు గుర్తొస్తయ్.. : రఘునందన్ రావు

రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నప్పుడే  సీఎం కేసీఆర్​కు పథకాలు గుర్తొస్తాయని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు విమర్శించారు. డబుల్​ బెడ్రూం ఇళ్ల పంపిణీ జరగకపోవడంతో కామారెడ్డిలో ఆయన ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్​వాటి అమలును మర్చిపోయారని ఆరోపించారు. 

డబుల్​ బెడ్రూం ఇళ్లని పేద ప్రజలకు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. హుజురాబాద్​ఎన్నికలప్పుడు దళిత బంధు అని.. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వివిధ వర్గాల ప్రజలకు రూ.లక్ష సాయం చేస్తామంటూ సీఎం అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. కామారెడ్డి జిల్లాలో దళితబంధు ఎంత మందికి ఇచ్చారని బీఆర్​ఎస్​ని ప్రశ్నించారు. 

తీపి మాటలు చెబుతూ కేసీఆర్​ మోసం చేస్తున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలు బూత్​స్థాయి నుంచి ప్రజలకు అధికార పార్టీ అరాచక విధానాల్ని వివరించాలని సూచించారు. ప్రధాన మంత్రి ఆవాస్​ యోజన పథకాన్ని కేంద్రం ప్రవేశ పెడితే.. కేసీఆర్​ ఆ నిధులతో కట్టిన ఇళ్లను తమవిగా చెబుతున్నారని ఆరోపించారు. గృహలక్ష్మీ పథకానికి రూ.3 లక్షలు ఇస్తామన్న ప్రభుత్వం దాని ఊసే ఎత్తట్లేదని అన్నారు. 

ALSO READ:కేసీఆర్ సీఎం కావడం పేదలకు శాపం... స్కామ్లు తప్ప చేసిందేమీ లేదు

ఈ పథకాన్ని బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు లంచాల రూపంలో వాడుకుంటున్నారని అన్నారు. గులాబీ కండువ కప్పుకున్న వారికే బీసీ బంధు ఇస్తున్నారని ఆరోపించారు. నాలుగేళ్లుగా కామారెడ్డిలో కట్టిన ఇళ్లను ఎందుకు కేటాయించట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆగస్టు 15 వరకు ఇళ్ల కేటాయింపు జరపకపోతే గ్రామాల్లో ధర్నాలు చేయాలని ప్రజలకు సూచించారు. మూడు నెలల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని రఘునందన్​ ధీమా వ్యక్తం చేశారు.