
దుబ్బాక, వెలుగు: నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో జనాల్ని తాగు బోతులుగా మారుస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. ఎద్దేవా చేశారు. శుక్రవారం మండలంలోని పద్మనాభునిపల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మళ్లీ కేసీఆర్ గెలిస్తే ఇంటి ముందరకే క్వాటర్ సీసా వచ్చే ప్రమాదం ఉందన్నారు. చిన్న పిల్లలు కూడా తాగుడుకు బానిసయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు.
కేసీఆర్ ప్రభుత్వం రాకముందు లిక్కర్‌పై ఆమ్దాని రూ.10 వేల కోట్లు వచ్చేదని, ఇప్పుడేమో రూ.50 వేల కోట్లు వస్తోందన్నారు. గ్రామాల్లోకి ప్రచారానికొచ్చే బీఆర్ఎస్ నాయకులను దళిత, బీసీ, మైనార్టీ బంధులేవని, రుణమాఫీ ఏదని, ఇంటికో ఉద్యోగం, నీళ్లు, నిధులు ఏవని నిలదీయాలన్నారు. మరొక్కసారి బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తే దుబ్బాక రూపు రేఖలే మార్చేస్తానని హామినిచ్చారు.
తొగుట, దౌల్తాబాద్: ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే దుబ్బాక నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మండలంలోని మల్లేశం పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ బీజేపీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అనంతరం మాట్లాడుతూ.. రాబోయే బీజేపీ ప్రభుత్వంలో బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటాడన్నారు. తెలంగాణలో మద్యం ఏరులై పారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులన్నీ కేంద్రానియే అన్నారు.