
దుబ్బాక, వెలుగు: బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ కులపోళ్లు తప్ప మరొకరు సీఎం కాలేరని, అదే బీజేపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా సీఎం కావొచ్చని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. శనివారం అక్భర్పేట-భూంపల్లి మండలం, బేగంపేట, భూంపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను గెలిచిన తర్వాతనే అక్భర్పేట-భూంపల్లి మండలం కోసం అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌కు పలు మార్లు వినతి పత్రాలు ఇచ్చానన్నారు.
ఇక్కడి ప్రజల కష్టాలు, బాధలను అర్థం చేసుకుని మండలం అయ్యేంత వరకు నిష్ర్కమించలేదన్నారు. మంత్రి హరీశ్‌రావు కారు వెనుక సీట్లో కూర్చోని వచ్చే ఎంపీ ఏనాడైనా సీఎంతో కానీ, మంత్రితో కానీ అక్భర్పేట-భూంపల్లి మండలం కావాలని అడిగాడా అని నిలదీశారు. రామలింగన్న ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం నియోజకవర్గంలో అడుగు పెట్టని ఎంపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి బెల్టు షాపులపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులపై లేదన్నారు. ఈ ప్రాంత బిడ్డగా మరొక్కసారి బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. మైనార్టీ సోదరులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి తమ ఓటు మీకేనని తీర్మానించారు.