
గజ్వేల్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఫామ్‌హౌజ్‌కే పరిమితమవుతుందని, అల్లుడు తూర్పునకు, కొడుకు పడమరకు పోతారని బీజేపీ గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్రెండూ ఒక్కటేనని ఒకే నాణేనికి ఉండే బొమ్మ, బొరుసులాంటివన్నారు.
2015లో సీఎంగా ఉన్న కేసీఆర్, చంద్రబాబు నాయుడుతో కలిసి అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి వద్ద సంతకం చేయలేదా అని ప్రశ్నించారు. 299 టీఎంసీలు తెలంగాణకు, 511 టీఎంసీలు ఏపీకని నువ్వు, నీ మామ సంతకం చేసిన కాగితం తాను పంపిస్తానని హరీశ్‌రావుకు ఛాలెంజ్‌విసిరారు. 2015లో సంతకం పెడితే 9 ఏండ్లకు హరీశ్ రావు నిద్రలేచిండని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తానన్న కాంగ్రెస్ ఇప్పుడేమో 17 ఎంపీ స్థానాలు ఇస్తే హామీలు నెరవేరుస్తామని చెప్పడం విడ్డూరమన్నారు.
గజ్వేల్ రైల్వే లైన్ బీజేపీ వల్లే సాధ్యం అయిందని, కొమురవెల్లి రైల్వే స్టేషన్శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.