
రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్అడ్డాగా రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తూ బీఆర్ఎస్ నేతలు డబ్బులు సంపాదించుకున్నారే తప్ప ప్రజల గురించి ఆలోచించలేదని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్ధి ఎం. రఘునందన్ రావు ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. మంగళవారం బీహెచ్ ఈఎల్ జిల్లా పరిషత్స్కూల్దగ్గర ఆయన వాకర్స్‌తో మాట్లాడారు.
అనంతరం కీర్తి మహల్ సెంటర్, విద్యుత్ నగర్లో కూడా వాకర్స్ మీటింగ్‌లో పాల్గొన్నారు. తెల్లాపూర్ రైల్వే స్టేషన్దగ్గర ఆయన మాట్లాడుతూ, తాను తెల్లాపూర్‌లోనే ఉంటానని, ఇక్కడే ఓటుహక్కు ఉందని చెప్పుకుంటున్న వ్యక్తి ఇక్కడి ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. తెల్లాపూర్ రైల్వే స్టేషన్‌కు వచ్చేందుకు సరైన దారి లేక ఇక్కడి ప్రజలు లింగంపల్లికి వెళ్లి ఎంఎంటీఎస్ ఎక్కుతున్నారని అన్నారు. పదేళ్లలో రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించకపోవడం సిగ్గుచేటన్నారు. తాను గెలిచిన వెంటనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేయిస్తానన్నారు. తెల్లాపూర్ 7వ రేడియల్ రోడ్డును రింగ్ రోడ్డుకు లింక్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుందన్నారు.