
- అధికారంలో ఉన్నప్పుడు హెచ్‌సీయూ భూములను రికార్డుల్లోకి ఎందుకు ఎక్కియ్యలేదు?: రఘునందన్
- హెచ్‌సీయూలో రోడ్లేసినప్పుడు బావాబామ్మర్దులు ఏడబోయిన్రని ఫైర్
హైదరాబాద్, వెలుగు: హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ తీరు.. దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ‘‘బీఆర్ఎస్ నేతలు పదేండ్లు అధికారంలో ఉండి.. ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. హెచ్‌సీయూ భూములపై మొసలి కన్నీళ్లు కార్చుతున్నారు. హెచ్‌సీయూలో రోడ్లు వేసినప్పుడు బావాబామ్మర్దులు (హరీశ్ రావు, కేటీఆర్) ఎటుపోయారు” అని ప్రశ్నించారు. హెచ్‌సీయూ భూమి ఇంచు కూడా పోకుండా విద్యార్థుల తరఫున కొట్లాడతామని తెలిపారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ గురువారం హైదరాబాద్‌కు వచ్చింది.
ఈ కమిటీకి బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు కలిసి నివేదిక అందజేశారు. అనంతరం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు హెచ్‌సీయూ భూములను కాపాడేందుకు బీఆర్ఎస్ నేతలు ఏం చర్యలు తీసుకున్నారని ఆయన నిలదీశారు. ‘‘ములుగులో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీ భూమిని పహాణీలో ఎక్కించారు. కానీ1974లో హెచ్‌సీయూకు ఇచ్చిన భూములను మాత్రం వర్సిటీ పేరు మీద చేయలేదు.
ఎందుకు వాటిని రికార్డుల్లోకి ఎక్కించలేదు? బీఆర్ఎస్ నేతలు పదేండ్లు అధికారంలో ఉండి ఏం చేశారు?” అని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం మీడియా ముందుకు వచ్చి వాళ్లే భూములను కాపాడే ప్రయత్నం చేసినట్టుగా చెబుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం ఆఫీసును కూడా రియల్ ఎస్టేట్ ఆఫీసుగా మార్చారని అన్నారు. హెచ్‌సీయూ భూములను కాపాడాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి వినతిపత్రం అందజేశామని చెప్పారు.