ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై పోలీసులకు టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. 2021లో తనను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ 2024, జూన్ 10వ తేదీ సోమవారం గుంటూరు పోలీస్ స్టేషన్ లో రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్, సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఇతర అధికారులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో తెలిపారు.
తనను హింసించడమే కాకుండా.. తనకు అయిన గాయాలపై కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చారని చెప్పారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన గుంటురు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.ప్రభావతిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపారు. జగన్ ను విమర్శిస్తే.. తనను చంపేస్తానని పీవీ సునీల్ కుమార్ ఐపీఎస్ బెదిరించారని ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు.
కాగా, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఏకంగా 164 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ ఎన్నికల్లో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున రఘురామ కృష్ణంరాజు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.