రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నడు :కాంగ్రెస్ ఆశావహులు

రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నడు :కాంగ్రెస్ ఆశావహులు
  • చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం ముందు  ప్రమాణం చేసిన ఆశావహులు 

హైదరాబాద్/సికింద్రాబాద్​, వెలుగు : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నుంచి గద్వాల్, ఉప్పల్ , బహదూర్​పురా టికెట్లు ఆశించి భంగపడ్డ డాక్టర్ కురువ విజయ్​కుమార్, రాగిడి లక్ష్మారెడ్డి, ఖలీమ్ బాబా ఆరోపించారు. ఈ మేరకు వారు మంగళవారం చార్మినార్​లోని భాగ్యలక్ష్మి ఆలయం వద్ద అమ్మవారి ఎదుట ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా విజయ్​కుమార్, లక్ష్మారెడ్డి, ఖలీమ్ బాబా మాట్లాడుతూ.. రేవంత్ టికెట్లు అమ్ముకున్నాడని మేము అమ్మవారి ఎదుట ప్రమాణం చేశామన్నారు. టికెట్లు అమ్ముకోలేదని భాగ్యలక్ష్మి అమ్మవారి ఎదుట  రేవంత్ రెడ్డి ప్రమాణం చేయాలన్నారు.

ఏండ్ల తరబడి కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వారికి అన్యాయం జరుగుతోందన్నారు. టికెట్ల విషయంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని రేవంత్ రెడ్డి తన మనవడిపై ప్రమాణం చేయాలని వారు డిమాండ్ చేశారు. రూ.కోట్ల డబ్బు, ఎకరాల కొద్దీ భూములు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్​లో బీసీలకు రేవంత్ అన్యాయం చేస్తున్నారని.. ఆయన సమాధానం చెప్పకపోతే ఎక్కడికక్కడ అడ్డగిస్తామన్నారు.

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో రూ.4 కోట్లు ఇవ్వనందుకే..

 జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తనను రూ.4 కోట్లు అడిగారని.. ఆ డబ్బు ఇవ్వకపోవడంతో కక్ష కట్టి ఇప్పుడు తనకు టికెట్ దక్కకుండా చేశాడని రాగిడి లక్ష్మారెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని.. వాటిని కాంగ్రెస్ అధిష్టానానికి పంపించామన్నారు.  అందుకే తమను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించాడన్నారు. మమ్మల్ని సస్పెండ్ చేసే అర్హత రేవంత్ రెడ్డికి లేదని.. అందుకే తామే పార్టీని వీడుతున్నట్లు రాజీనామా లేఖలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించామని లక్ష్మారెడ్డి,విజయ్​కుమార్, ఖలీమ్ తెలిపారు.