రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పశువైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. కాలేజీలోని సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా 20 మంది విద్యార్థులు లేఖలు రాసి, వాటిని ఫిర్యాదు బాక్స్ లో వేశారు. ఈ విషయంపై విద్యార్థులు పలుమార్లు హెచ్చరించినా సీనియర్స్ పద్ధతి మార్చుకోకపోవడంపై జూనియర్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో మరోసారి జూనియర్ విద్యార్థుల పై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడడంతో యాజమాన్యం స్పందించింది. జూనియర్ విద్యార్ధుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి 34 మంది విద్యార్థులపై చర్యలు తీసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడిన 34 మంది విద్యార్థులను వీసీ సస్పెండ్ చేశారు.