Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీకి నో ఛాన్స్.. రహానే, పుజారాలకు సెలక్టర్లు గుడ్ బై

భారత వెటరన్ ప్లేయర్లు.. టెస్ట్ స్పెషలిస్ట్ అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా ఇకపై టీంఇండియాలో కనిపించడం కష్టంగానే కనిపిస్తుంది. దశాబ్దకాలంగా భారత టెస్ట్ జట్టులో కీలక పాత్ర పోషించి ద్రావిడ్, లక్ష్మణ్ వారసులుగా పేరు తెచ్చుకున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలలో భారత్ సాధించిన విజయాల్లో వీరు కీలక పాత్ర పోషించారు. మూడో స్థానంలో పుజారా అడ్డుగోడలా నిలబడితే.. ఐదో స్థానంలో రహానే నిలకడగా రాణించాడు. బాగా ఆడవుతూ టెస్టుల్లో వీరి స్థానం సుస్థిరం చేసుకున్నారు.       

పుజారా, రహానే లకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తుంది. వీరు కంబ్యాక్ ఇవ్వడం కూడా కష్టంగానే కనిపిస్తుంది. తాజాగా సెలక్టర్లు వీరిని దులీప్ ట్రోఫీ కోసం పరిగణలోకి తీసుకోట్లేదని సమాచారం. దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 5 నుంచి అనంతపురం (ఆంధ్రప్రదేశ్)లో జరగనుంది. మొత్తం టోర్నీలో ఆరు మ్యాచ్ లు జరుగుతాయి. రోహిత్, కోహ్లితో పాటు శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లను కూడా ఈ ట్రోఫీలో ఆడడం దాదాపుగా ఖాయమైంది. 

దులీప్ ట్రోఫీకి వీరు ఎంపిక కాకపోతే వీరి టెస్ట్ కెరీర్ దాదాపుగా ముగిసినట్టే. 2023 దక్షిణాఫ్రికా టూర్‌ లో భాగంగా టెస్టు జట్టు నుంచి ఈ వెటరన్‌ బ్యాటర్లను సెలక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే.  2020 నుండి పుజారా ఫామ్ దిగజారుతూ వస్తుంది. గత నాలుగేళ్లలో ఈ వెటరన్ ప్లేయర్ 28 టెస్టు మ్యాచ్ లాడితే యావరేజ్ 30 కంటే తక్కువగానే ఉంది. కేవలం ఒకసారి మాత్రమే మూడంకెల స్కోర్ ను చేరుకోగలిగాడు. నిలకడగా రాణించలేకపోవడం పుజారాకు మైనస్ గా మారింది.  

రహానే 2022 లో దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత పేలవ ఫామ్ తో టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనతో డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు సంపాదించిన రహానే రెండు ఇన్నింగ్స్ ల్లో వరుసగా 89,46 పరుగులు చేశాడు. కెరీర్ గాడిలో పడిందనుకున్న సమయంలో  జులైలో విండీస్ టూర్ లో జరిగిన టెస్ట్ సిరీస్ లో దారుణంగా విఫలమవడం రహానేకు ప్రతికూలంగా మారింది.