
ఐపీఎల్ 2025 సీజన్ ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తమ ప్రయాణాన్ని ఒక ప్రత్యేకమైన పూజా కార్యక్రమంతో ప్రారంభించింది. ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, కెప్టెన్ అజింక్య రహానే బుధవారం (మార్చి 12) ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. ఆటగాళ్ళు తమ మొదటి శిక్షణా సెషన్ కోసం మైదానంలోకి దిగే ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు నల్లటి స్టంప్‌లపై దండ వేసి, రహానే కొబ్బరికాయ కొట్టాడు. ఆండ్రీ రస్సెల్, అన్రిచ్ నార్ట్జేతో కీలక ఆటగాళ్ళు శిబిరంలో చేరారు.
ఈ కార్యక్రమంలో కోచ్ చంద్రకాంత్ పండిట్ మాట్లాడుతూ "మేము ఇప్పటికే మా శిక్షణా సెషన్‌లను ప్లాన్ చేసుకున్నాము. ఛాంపియన్స్ ట్రోఫీ కారణంగా కొంతమంది అంతర్జాతీయ ఆటగాళ్ళు అందుబాటులో లేరు. కానీ మా కీలక ఆటగాళ్లు చాలా మంది ఇక్కడే ఉన్నారు. మేము మా సొంత గడ్డకు తిరిగి రావడం చాలా గొప్ప అనుభూతి. గత సీజన్ తర్వాత, మేము ఆ ఊపును కొనసాగించాలనుకుంటున్నాము". అని ప్రధాన కోచ్ అన్నారు. ఇటీవలే ఐపీఎల్ 2025 సీజన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ అజింక్య రహానేను కెప్టె గా నియమించిన సంగతి తెలిసిందే.
Also Read :- అయ్యర్‌ను కాదని రహానేకు కెప్టెన్సీ ఇవ్వడానికి కారణం అదే
తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ఈడెన్‌గార్డెన్స్ వేదిక. కోల్‌కతా నైట్ రైడర్స్ సొంత మైదానం, ఐకానిక్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ టోర్నీ ప్రారంభ మ్యాచ్, ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనుంది. నరైన్, వరుణ్ చక్రవర్తి రూపంలో ఆ జట్టులో ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లు ఉన్నారు. ఫినిషర్లుగా రింకూ సింగ్, రస్సెల్, రమణ్ దీప్ సింగ్ సిద్ధంగా ఉన్నారు. రహానే, వెంకటేష్ అయ్యర్ మిడిల్ ఆర్ద్ర భారాన్ని మోయనున్నారు. ఫాస్ట్ బౌలర్లుగా హర్షిత్ రానా, వైభవ్ అరోరా, అన్రిచ్ నోకియా సత్తా చాటనున్నారు.