పగ తీర్చుకున్న విండీస్ బాహుబలి.. సింగిల్స్ కన్నా సిక్సులే ఎక్కువే

పగ తీర్చుకున్న విండీస్ బాహుబలి.. సింగిల్స్ కన్నా సిక్సులే ఎక్కువే

సరిగ్గా రెండు వారాల క్రితం సెయింట్‌ లూసియా కింగ్స్‌, బార్బడోస్‌ రాయల్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మొదటి బంతికే విండీస్ బాహుబలుడు రకీమ్‌ కార్న్‌వాల్‌ హాస్యాస్పద రీతిలో రనౌట్ అయిన విషయం తెలిసిందే. ఇంకేముంది కొన్ని రోజులు కార్న్ వాల్ రనౌట్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఫిట్ నెస్ లేదని, ఆటకు పనికి రాడని, నిర్లక్ష్యంగా  వికెట్ సమర్పించుకున్నాడని విమర్శలు గుప్పించారు. మరి కొందరైతే ఈ ఆజానుబాహుడి మీద జోకులు సైతం వేసుకోవడం గమనార్హం. అయితే వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ సంచలన ఇన్నింగ్స్ తో చెలరేగాడు రాకీమ్‌ కార్న్‌వాల్‌. నాకు సింగిల్స్ తో పని లేదు సిక్సులే కొడతా అని భీభత్సం సృష్టించాడు.

బౌండరీలతోనే 88 పరుగులు:

సిక్సులు కొట్టాలంటే పవర్ తో పాటు మంచి టైమింగ్ కూడా తనకు ఉందని కార్న్ వాల్ కి మరోసారి నిరూపించాడు. కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఆదివారం బార్బడోస్ రాయల్స్ – సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ హల్క్ సెంచరీతో  సునామీ ఇన్నింగ్స్‌ ఆడేశాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.

మొత్తం 48 బంతుల్లో 4 ఫోర్లు, 12 సిక్సులతో 102 పరుగులు చేసిన కార్న్ వాల్ రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. అతని ముందు ముందు భారీ టార్గెట్ కూడా చిన్నబోయింది. 221 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేజ్ చేసి ఔరా అనిపించింది. కేవలం బౌండరీల రూపంలోనే 88 పరుగులు ఉండడం విశేషం. సెంచరీ తర్వాత కార్న్ వాల్ సెలబ్రేషన్ చూస్తుంటే తనని విమర్శించిన వారికి గట్టిగానే సమాధానం చెప్పినట్టుగానే కనిపిస్తుంది.

           
బార్బడోస్ రాయల్స్ సునాయాస విజయం:

 

మ్యాచ్ విషయానికి వస్తే.. సెయింట్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ ఆండ్రీ ఫ్లెచర్‌ (37 బంతుల్లో 56), మరో ఓపెనర్‌ విల్‌ స్మీద్‌ (36 బంతుల్లో 63 )పరుగులు చేసి తొలి వికెట్ కి 115 పరుగులు జోడించి మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత కెప్టెన్‌ రూథర్‌ఫర్డ్‌ సైతం 27 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 65 రన్స్‌ చేసి జట్టుకి భారీ స్కోర్ ను 220 పరుగులకే చేర్చాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బార్బడోస్ జట్టు 18.1 ఓవర్లలోనే 2 వికెట్ల కోల్పోయి ఛేజ్ చేసింది.కార్న్ వాల్ తో పాటు పావెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.