- కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి
- యోగి సర్కారు ప్రజలను విడగొడుతున్నది: ప్రియాంక
- ప్రభుత్వమే హింసకు పాల్పడింది: అఖిలేశ్
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ లోని సంభాల్ లో చెలరేగిన హింసాత్మక ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. హింసపై సుప్రీంకోర్టు సాధ్యమైనంత త్వరగా జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పక్షపాతంతో, అహంకార ధోరణితో వ్యవహరించడం దురదృష్టకరం. హింసలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. స్థానిక ప్రభుత్వం ప్రతిపక్ష నేతల మాట వినకుండా తొందరపాటుతో తీసుకున్న చర్యల కారణంగా పరిస్థితి హింసకు దారితీసింది.
అందుకు బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. హిందూ, ముస్లింలను విడగొట్టడానికి బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని వాడుకుంటున్నది. దీనివల్ల రాష్ట్రానికీ, దేశానికి ఎలాంటి లాభం లేదు” అని రాహుల్ పేర్కొన్నారు. ప్రజలంతా శాంతి, సామరస్యం పాటించాలని ఆయన కోరారు. సంభాల్ ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా కూడా స్పందించారు. యోగి ప్రభుత్వం ప్రజలను మతం ఆధారంగా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నదని ఆమె ఆరోపించారు.
హింస దురదృష్టకరమని ఆమె ట్వీట్ చేశారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ప్రియాంక కోరారు. సంభాల్ లో హింసకు యోగి ప్రభుత్వానిదే బాధ్యత అని, ప్రభుత్వమే ముందుండి హింసను నడిపిందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. సోమవారం పార్లమెంటు బయట మీడియాతో ఆయన మాట్లాడారు. సంభాల్ లో హింస జరిగిన సమయంలో తమ ఎంపీ జియా ఉర్ రెహమాన్ ఘటనా స్థలంలో లేరని, అయినా కూడా ఆయనపై కేసు నమోదు చేశారని ఆయన మండిపడ్డారు.