సంప్రదాయక రాజకీయాలు ముగింపు పలికిన రోజు జూన్ 4, 2024 అని సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ తన పార్లమెంట్ ఉపన్యాసంలో చెప్పారు. అదే సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ..2024 ఎన్నికలు రాజ్యాంగ స్ఫూర్తి గెలుపునకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. అయోధ్యలో ప్రతిపక్షాల గెలుపు అద్వానీ, బీజేపీ అయోధ్య కేంద్రంగా జరిపిన రాజకీయ యాత్రపై ఇండియా అలయన్స్ గెలుపు అని అన్నారు.
1990లో మండల్ కమిషన్ సిఫార్సు చేసిన ఓబీసీ రిజర్వేషన్ల అమలుకు వ్యతిరేకంగా బీజేపీ, అద్వానీ నాయకత్వంలో అయోధ్య రథయాత్రను నడిపింది. 1990 ఆగస్టు 7న వీపీ సింగ్ ప్రధానమంత్రిగా, జనతాదళ్ ప్రభుత్వం మండల్ కమిషన్‌ను అమలు చేస్తున్నామని పార్లమెంటులో ప్రకటించారు. దాంట్లో భాగంగా ఓబీసీలకు ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు తెలిపారు. కానీ, బీజేపీ నాయకులకు ఈ ప్రకటన మింగుడుపడలేదు.
రా జ్యాంగం ఆర్టికల్ 16 (4)లో భాగంగా ఓబీసీలకు రిజర్వేషన్లను ఇవ్వడమైనది. ఆర్టికల్ 340లో భాగంగా మండల్ కమిషన్( వెనుకబడిన తరగతుల కమిషన్)ను 1978లో జనతా పార్టీ ఏర్పాటు చేసింది. మండల్ కమిషన్, ఏగుర్తింపునకు నోచుకోక 43 సంవత్సరాలుగా అభివృద్ధికి, అవకాశాలకు దూరంగా ఉంటున్న 3,743 వెనుకబడిన కులాలకు దేశస్థాయిలో ఓబీసీలు అనే గుర్తింపు (ఓబీసీ ఐడెంటిటీ)ని ఇచ్చింది.
దాంతోపాటు ఈ రాజ్యాంగ కమిషన్ 40 సిఫారసులను చేసింది. వెను కబడిన వర్గాలు అసమానతలను అధిగమించి, ఆత్మగౌరవంతో సమాన పౌరులమనే ఆత్మవిశ్వాసంతో దేశం ముందుకుపోవడానికి ఈ 40 సిఫారసులు ఉపకరిస్తాయని పేర్కొంది. కానీ, పెద్ద కులాల కేంద్రంగా ఉన్న బీజేపీ.. మండల్ కమిషన్ సిఫార్సులను వ్యతిరేకించింది.
మండల్ వర్సెస్ కమండల్
అద్వానీ నాయకత్వంలో అయోధ్య రథయాత్రను బీజేపీ చేపట్టింది. ఇది మండల్ వర్సెస్ కమండల్ గా దేశ చరిత్రలో నిలిచిపోయింది. ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలుచేయడంతో దేశంలోని అన్ని సామాజిక వర్గాలకు రిజర్వేషన్లను పొందుటకు అవకాశం దొరికింది. రిజర్వేషన్లపై చర్చ ఈ దేశంలో ఒక శతాబ్దం కంటే ఎక్కువగానే జరుగుతోంది. మొదటిసారి సాహు మహారాజ్ 1902లో బ్రాహ్మణేతరులకు 50% రిజర్వేషన్లను కల్పించడాన్ని బ్రాహ్మణ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఆ వ్యతిరేకత ఈరోజు వరకు కొనసాగుతూనే ఉంది. ధనిక వర్గాలు కూడా వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ల వల్ల మెరిట్ దెబ్బతింటుందని అన్నారు. దాంతోపాటు సెకండ్ క్లాస్ పౌరులతో పాలనా రంగం అసమర్థంగా మారుతుందని చిత్రీకరించారు. కులతత్వం పెరుగుతుందని, అందుకే ఓబీసీ రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ మండల్ వ్యతిరేక ఉద్యమాలు ఉత్తర భారతదేశంలో జరిగాయి.
దశాబ్దాల తరబడి ఓబీసీలకు రిజర్వేషన్లు లేవు
ఓబీసీలు రిజర్వేషన్లు, 1993 వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోచుకోలేకపోయారు. కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలలో 2008 వరకు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు లేవు. అంటే స్వాతంత్ర్యం వచ్చిన 46 సంవత్సరాల వరకు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఓబీసీలు లేరు. కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలకు 46 సంవత్సరాలు, ఉన్నత విద్య కోసం 61 సంవత్సరాలు వెనుకబడిన తరగతులు నోచుకోలేదు.
యూపీలో బీజేపీని అడ్డుకున్న ఎస్పీ
ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీని సమాజ్‌వాది పార్టీ- కాంగ్రెస్ తో కలిసి ఓడించింది. అందుకే అయోధ్యలో సమాజ్ వాది పార్టీ దళిత అభ్యర్థి అవధేశ్ ప్రసాద్ గెలుపును సంప్రదాయ రాజకీయాల అంతంగా పేర్కొనడమైనది. ఇది ఇండియా అలయన్స్ గెలుపుగా, రాజ్యాంగ గెలుపుగా, మండల్ రాజకీయాల గెలుపుగా చర్చించడం జరుగుతున్నది. 'భారతదేశం అనే భావన' మీద బీజేపీ నిరంతరం దాడి చేస్తోందని రాహుల్ గాంధీ చెప్పారు.
అదేవిధంగా దేశ సంపదను కొన్ని ధనిక వర్గాల వద్ద కేంద్రీకరించడం రాజ్యాంగ ఆదేశిక సూత్రాలకు వ్యతిరేకమైన చర్య అని అన్నారు. సంపదను పంచుతూ పలు వర్గాల మధ్య ఉన్న అసమానతలను తగ్గించాలని రాజ్యాంగం సూచిస్తోంది. కానీ, బీజేపీ హిందూత్వ రాజకీయాలు సమానత్వ భావనకు వ్యతిరేకం. దాంతోపాటు ప్రజలను, పోరాడే శక్తులను భయాందోళనకు గురిచేసేవిగా గత పది సంవత్సరాలుగా బీజేపీ రాజకీయాలు చేస్తోంది.
అహింసను ప్రోత్సహిస్తూ, వాస్తవాల దగ్గరగా జీవనం సాగాలని మతాలు బోధిస్తున్నాయని రాహుల్ లోక్‌సభలో ప్రసంగించారు. కానీ, బీజేపీ రాజకీయాలు వీటికి భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. అఖిలేశ్ యాదవ్ లోక్ సభలో మాట్లాడుతూ బహుళ పార్టీల ప్రజాస్వామ్యాన్ని ఏకపార్టీ స్వామ్యం (లోక్‌తంత్రను ఏక్‌తంత్ర)గా మార్చే రాజకీయాలను 2024 ఎలక్షన్ ఆపగలిగిందని అన్నారు.
మండల్ ఉద్యమంతో బీసీలకు గుర్తింపు
మొదటిసారి బ్యాక్వర్డ్ క్లాసెస్ కి మండల్ ఉద్యమం ద్వారా గుర్తింపు లభించింది. ప్రొఫెసర్ కేసీ యాదవ్ తన 'ఇండియాస్ అన్ఈక్వల్ సిటిజన్స్' అనే పుస్తకంలో.. ఆగస్టు 7, 1990 ని బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి ఆగస్టు 15, 1947 స్వతంత్ర దినంతో పోల్చదగినది'గా పేర్కొన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన పరిణామాన్ని బీజేపీ సాంప్రదాయ హిందూత్వ రాజకీయాలు వ్యతిరేకించడం దురదృష్టకరం. ఓబీసీలు 52 శాతంగా ఉన్నట్లు మండల్ పేర్కొన్నారు. దేశంలో సగం జనాభాతో కూడుకున్న సామాజిక వర్గాల గుర్తింపును, ప్రగతిని పలు రూపాలలో బీజేపీ అడ్డుకుంటూ తన రాజకీయాలను కొనసాగించింది.
గత 34 సంవత్సరాలుగా 'రాజకీయ హిందూత్వ' ముసుగు వేసి 52 శాతంగా ఉన్న ఓబీసీ- హిందువుల ఉన్నతిని అడ్డుకుంటూ వస్తున్నది. ముఖ్యంగా ఓబీసీ రిజర్వేషన్లకు వివిధ రూపాలలో, పలు రంగాలలో, వివిధ స్థాయిలలో..బీజేపీ 'హిందూత్వ' స్పృహ ఓబీసీలకే కాక, ఎస్సీ, ఎస్టీలకు కూడా అడ్డంకిగా మారింది. దాంట్లో భాగంగా 400+ (చార్ సౌ పార్) నినాదం రాజ్యాంగాన్ని మార్చేదిగా గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అయోధ్యలో బీజేపీని ఓడించారు. అయోధ్యతోపాటు దాని చుట్టూ ఉన్న 5 ఎంపీ స్థానాలలో కూడా బీజేపీ పరాజయాన్ని ఎదుర్కొంది.
- ప్రొఫెసర్ సింహాద్రి సోమనబోయిన,
అధ్యక్షుడు,
సమాజ్ వాది పార్టీ, తెలంగాణ