దేశాన్ని విదేశాల్లో చులకన చేయడమంటే, ఇక్కడి అధికార మార్పిడికి విదేశీ సహకారాన్ని కోరడం వంటిదే. ఇక్కడి ఆర్థిక విధానాలను దెబ్బతీసేందుకు భారత ప్రభుత్వంపై తప్పుడు కథనాలు సృష్టించడం, పార్లమెంట్ నడవకుండా చేయడం, ఆధారాలు లేని ఆరోపణలతో దేశ ప్రజలను మభ్యపెట్టాలని చూడటం తదితర వికృత చేష్టలు దేశానికి నష్టంచేస్తాయి.
అ మేథీ నుంచి 2004, 2009, 2014లో ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీ 2019లో ఓడిపోయారు. కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచి ఊపిరి పీల్చుకున్నారు. 2004 నుండి 2014 వరకు ఉన్న యూపీఏ ప్రభుత్వంలో కనీసం ఒక మంత్రి పదవి తీసుకొని తన సామర్థ్యం నిరూపించుకోలేదు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ప్రతిపక్ష బాధ్యతను ఎప్పుడూ నిర్వర్తించలేదు. ఈ 19 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఎలాంటి ప్రాధాన్యతను చాటుకోలేదు. పార్లమెంటులో ఇతని హాజరు 50 శాతం లోపే. ఏ ఒక్క ప్రైవేటు బిల్లు చర్చలో, ప్రశ్నోత్తరాల సమయంలో ఎన్నడూ పాల్గొనలేదు.
2007 నుండి కాంగ్రెస్ ప్రధాన కార్శదర్శిగా, 2013 నుండి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడిగా, 2017 నుంచి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు నిర్వర్తించారు. కానీ 2014లో , 2019లో కాంగ్రెస్ కనీసం ప్రతిపక్షహోదా స్థాయిలో కూడా సీట్లు దక్కించుకోలేనందున రాహుల్ తన అధ్యక్ష పదవిని వదిలేశారు. 2014 నాటికి 14 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో రాష్ట్రాల్లో క్రమంగా అధికారం కోల్పోతూ నేడు 3 రాష్ట్రాలకు పరిమితమైంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ మాత్రమే కాంగ్రెస్ ఖాతాలో చేరింది.
అసమర్థుడు
రాహుల్ నాయకత్వంలో ఉండగా 460 మంది ప్రముఖ నాయకులు కాంగ్రెస్ ను వీడారు. 23 మంది సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గులాం నబీ ఆజాద్, అమరేందర్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, కపిల్ సిబల్, విజయ్ బహుగుణ లాంటి వాళ్లు ఇతని నాయకత్వాన్ని ప్రశ్నించిన వారిలో ఉన్నారు. 277 మంది శాసనసభ్యులు పార్టీ విడిచి వెళ్లారు. అయినా కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టు, ఓడితే ఎలక్ట్రానిక్ మిషన్లు తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. ఇంతటి అప్రజాస్వామిక వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం సిగ్గుచేటు. రాహుల్ గాంధీ ఎక్కడా దేశహితం కోరడం లేదు. నరేంద్ర మోడీని, బీజేపీని గద్దె దించేందుకే ఇతని తపస్సంతా.
32 మంది కోల్పోయినప్పుడు ఎందుకు మాట్లాడలే?
2019 కర్ణాటక ఎన్నికల సందర్భంగా మోదీలందరూ దొంగలే అని మాట్లాడినందుకు రాహుల్ గాంధీ ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయనందుకే గుజరాత్ సూరత్ కోర్టు 2 సంవత్సరాల శిక్ష విధించింది. అదే క్రమంలో చట్టబద్ధంగా పార్లమెంటు సభ్యత్వం కోల్పోయాడు. సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా మన్మోహన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సును అప్పట్లో రాహుల్ చింపివేశారు. తన వరకు రాగానే సుప్రీం నిర్ణయాన్ని ఇపుడు తప్పుబడుతున్నారు. ఇక్కడ చట్టప్రకారం శిక్ష పడి, చట్ట ప్రకారం సభ్యత్వం కోల్పోతే బీజేపీని, నరేంద్ర మోడీని విమర్శిస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు.
మేం న్యాయ, శాసన, కార్యనిర్వాహక, మీడియా వ్యవస్థలకు అతీతం అనే అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికీ 32 మంది పార్లమెంటు సభ్యత్వం కోల్పోయి అనర్హులయితే చర్చ జరగలేదు. కానీ రాహుల్ గాంధీ విషయం వచ్చే సరికి కోర్టు నిర్ణయాలను తప్పుబడుతున్నారు. ఇది పక్కా రాజకీయ దివాళాకోరుతనం. రాహుల్ అజ్ఞానం, అహంకారంతో మాట్లాడిన మాటలకు ఇప్పటికే 7 పరువు నష్టం కేసులు నడుస్తున్నాయి. కేజ్రీవాల్ కూడా అరుణ్ జైట్లీపై తప్పుడు మాటలు మాట్లాడి, పరువు నష్టం కేసు ఎదుర్కొని, కోర్టులో తన మాటలు ఉపసంహరించుకొని, క్షమాభిక్ష అడిగి బయటపడ్డారు. రాహుల్ గాంధీ నేను వీర్ సావర్కర్ కాదు క్షమాభిక్ష అడిగేందుకు, నేను గాంధీ వారసుడినని ఎచ్చులకు పోతున్నారు.
కానీ చౌకీదార్ చోర్ అన్నందుకు, ఆర్ఎస్సెస్ పై ఆరోపణలు చేసినందుకు సుప్రీం కోర్టులో క్షమాపణలు చెప్పిన విషయం మర్చిపోయారు. సూరత్ కోర్టు శిక్ష వేసే ముందు ఈ రెండు ఉదాహరణలు తెలిపి, ఇంకా నీకు బుద్ధి రాలేదని 2 సంవత్సరాల శిక్షను ప్రకటించింది. దీంతో మానసిక సంతులన కోల్పోయి వీర్ సావర్కర్ పై అవాకులు చెవాకులు పేలడం చూస్తే.. ఆయనలో దాగి ఉన్న దోషి కనిపిస్తాడు! ఒకసారి విశ్వామిత్రుడు మందరను ఉద్దేశించి ‘యతోజాత’ అని అన్నాడు. అంటే తల్లిదండ్రులు, దేశం పట్ల తెలిసి ఉండాలి అని!
రాహుల్ 250 విదేశీ యాత్రలు దేనికి?
రాహుల్ గాంధీ 2014 నుంచి 2023 మార్చి వరకు 250 విదేశీ పర్యటనలు చేసినట్లు పార్లమెంటులో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. రాహుల్ గాంధీ ఎప్పుడు విదేశాలకు వెళ్లినా ఏదో ఒక విదేశీ సంస్థ నుంచి ఏదో ఒక ఆరోపణ వస్తుంది. ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు అమెరికా, యూరప్ లలోని కొన్ని విదేశీ సంస్థలు భారత్ పై ఏదో ఒక వార్త రాయడం అలవాటుగా మారింది. ఆ తర్వాత పార్లమెంట్ సెషన్ లో గొడవ చేయడం పరిపాటయ్యింది.
ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలు కొంటే, చైనా ప్రోద్భలంతో 2 సంవత్సరాలు అనేక విమర్శలు చేసి, పార్లమెంట్ స్తంభింప చేసి, సుప్రీం కోర్టులో కేసు వేసి విఫలమయ్యారు. ఫ్రాన్స్ లో ఊరుపేరు లేని పత్రిక ఒక వార్త రాస్తే ఇక్కడ పార్లమెంట్ స్తంభింపచేశారు. పెగాసెస్ వార్తను అమెరికా నుంచి రాయించి ఇక్కడ పార్లమెంటును స్తంభింపచేశారు. కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లినా ఎలాంటి ఫలితం రాలేదు. సుప్రీం అడిగినా కూడా రాహుల్ తన ఫోన్ను సమర్పించ లేదు. జార్జ్ సోరోస్ లింక్ తో 10 మంది ఉద్యోగులు లేని హిండన్ బర్గ్ అనే సంస్థ ద్వారా అదానిపై ఒక వార్తను సృష్టించి గత కొన్ని రోజులుగా పార్లమెంటును స్తంభింప చేస్తూవస్తున్నారు.
వ్యతిరేకంగా మాట్లాడి..
ఇక రైతుల ఉద్యమం ముసుగులో ఒక సంవత్సరం పాటు కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఆమ్ ఆద్మీ పార్టీలు పరోక్షంగా ఖలిస్థాన్ ఉద్యమం నడిపారు. ఎర్రకోటపై ఖలిస్థాన్ జెండా ఎగరవేసే ప్రయత్నం జరిగింది. ఈ చర్యను ఏ పార్టీ ఖండించలేదు. దాని పరిణామాలు నేడు మనకు కనిపిస్తున్నాయి. సోనియా నాయకత్వంలోని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా నుంచి అందిన విరాళాల సమాచారం తెలియగానే కేంద్ర ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు. బీజింగ్ ఒలింపిక్స్ కు ప్రధాని మన్మోహన్ కాకుండా సోనియా, రాహుల్, ప్రియాంక వాద్రా వెళ్లి చైనా అతిథి మర్యాదలు పొంది వచ్చారు.
నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన రూ.5వేల కోట్ల అవినీతి కేసులో సోనియా, రాహుల్ బెయిల్ పై ఉన్నారు. అందుకే ఆధారం లేని అబద్ధాలతో ప్రధాని మోడీపై ఎదురుదాడికి దిగారు. పుల్వామా నుంచి బాలాకోట్ వరకు ఆధారాలు అడుగుతారు. భారత సైన్యాన్ని అవమానపరుస్తారు. భారత రక్షణ రంగం అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడుతారు. దేశం కన్నా తమకు అధికారమే ముఖ్యమనుకుంటారు.
- నరహరి వేణుగోపాల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు