Rahul Dravid: కోచ్‌ పదవికి గుడ్ బై.. క్లారిటీ ఇచ్చిన ద్రవిడ్‌

Rahul Dravid: కోచ్‌ పదవికి గుడ్ బై.. క్లారిటీ ఇచ్చిన ద్రవిడ్‌

భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ విషయంలో రాహుల్ ద్రావిడ్ క్లారిటీ ఇచ్చేశాడు. టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా కొనసాగనని స్పష్టం చేశాడు. టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం (జూన్ 5) ఐర్లాండ్‌తో భారత్‌ మ్యాచ్ ఆడనుంది ఈ మ్యాచ్ కు ముందు రాహుల్‌ ద్రవిడ్‌ మీడియాతో మాట్లాడాడు. కోచ్ గా ఉన్నంత కాలం ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని.. ప్రతి టోర్నీ తనకు ముఖ్యమేనని వెల్లడించాడు. టీ20 వరల్డ్ కప్-2024 తనకు ఆఖరిదంటూ  చెప్పి షాక్ ఇచ్చాడు. 

2021నవంబర్‌లో టీమిండియా కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ద్రవిడ్... గత నెలలో బీసీసీఐ మళ్లీ కోచ్‌ పదవికి దరఖాస్తులు ఆహ్వానించినా మళ్లీ దరఖాస్తు చేసుకోలేదు. ఇందులో భాగంగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానించింది. హెడ్ కోచ్ రేసులో భారత లెజెండ్ గౌతం గంభీర్ పేరు బలంగా వినిపిస్తుంది. ఆస్ట్రేలియా దిగ్గజాలు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్లు బలంగా వినిపించాయి. అయితే వీరిలో ఏ ఒక్కరు కూడా ఆ పోస్ట్​కు అప్లై చేసుకోలేదని వార్తలు వచ్చాయి. 

టీమ్ ఇండియా హెడ్ కోచ్ పాత్రపై బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కేకేఆర్ మెంటార్, టీమిండియా మాజీ ఓపెనర్ గంభీర్ తో బీసీసీఐ సెక్రటరీ జైషా  సుదీర్ఘంగా చర్చించినట్లు జరిపినట్టు క్రిక్ బజ్ నివేదిక వెల్లడించింది. గంభీర్ దాదాపు టీమిండియా హెడ్ కోచ్ గా రాబోతున్నట్టు.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.