IND Vs ENG 1st Test: కుర్రాళ్లకు అనుభవం లేదు..ఓడినా బ్యాటర్లను సమర్ధించిన ద్రవిడ్

IND Vs ENG 1st Test: కుర్రాళ్లకు అనుభవం లేదు..ఓడినా బ్యాటర్లను సమర్ధించిన ద్రవిడ్

ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయింది. హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 231 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేజ్ చేయలేక ఓటమిపాలైంది. సొంతగడ్డపై భారత్ ఓడిపోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మ్యాచ్ లో ఓటమికి ప్రధాన కారణాలు పరిశీలిస్తే బ్యాటింగ్ లోపమనే చెప్పుకోవాలి. అనుభవాన్ని పక్కనపెట్టి కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడం భారత జట్టు పరాజయానికి కారణమైంది. ఇదే విషయంపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. 
 
ప్రస్తుతం భారత జట్టులో ఉన్న యంగ్ ప్లేయర్లకు టాలెంట్ ఉన్నా.. వారికి అనుభవం లేదని వెనకేసుకొచ్చాడు. కోహ్లీ వ్యక్తిగత కారణాల వలన తప్పుకోవడం.. రహానే, పుజారా మిడిల్ ఆర్డర్ లో లేకపోవడంతో 231 పరుగులు ఛేజ్ చేయడంలో తడబడ్డారు. ఈ మ్యాచ్ లో ఓడిపోయినా జట్టులో కొనసాగడానికి అందరూ అర్హులే అని కోచ్ రాహుల్ ద్రవిడ్ సమర్ధించాడు. దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారించారు కాబట్టే ఇక్కడికి వచ్చారు. ఛాలెంజింగ్ వికెట్ పై ఛేజింగ్ చేయడం కొత్తవాళ్లకు కొంచెం కష్టమేనని ద్రవిడ్ అన్నారు. ఈ సిరీస్ నుంచి తొలి రెండు టెస్టులకు కోహ్లీ తప్పుకోగా.. ఫామ్ లేకపోవడంతో పుజారా,రహానేను పక్కన పెట్టారు. 

ఈ మ్యాచ్ లో యువ ఆటగాళ్లు గిల్, అయ్యర్ ఘోరంగా విఫలమయ్యారు. రెండు ఇన్నింగ్స్ ల్లో గిల్ 23 పరుగులు చేస్తే.. అయ్యర్ 48 పరుగులు చేశారు. ఈ సిరీస్ కు ముందు జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్ లో సైతం అయ్యర్, గిల్ ఘోరంగా విఫలమయ్యారు. 231 పరుగుల ఛేజింగ్ లో గిల్ డకౌట్ అయితే.. అయ్యర్ 10 పరుగులతో సరిపెట్టుకున్నాడు. వీరిద్దరి బ్యాటింగ్ కారణంగానే భారత్ మ్యాచ్ ఓడిపోయింది అని ఇప్పటికే నెటిజన్స్ మండిపడుతున్నారు. చివరి 10 ఇన్నింగ్స్ లు చూసుకుంటే గిల్, అయ్యర్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడం వీరి పేలవ ఫామ్ ను సూచిస్తుంది. ఓపెనర్ జైస్వాల్ తన స్థానానికి న్యాయం చేస్తున్నాడు. 

టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ నిర్ధేశించిన 231 పరుగుల ఛేదనలో 179కే కుప్పకూలి.. 37 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఇంగ్లీష్ స్పిన్నర్ హార్టిలి 7 వికెట్లు తీసుకొని భారత పరాజయానికి కారణమయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో 196 పరుగులు చేసిన పోప్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యం లభించింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 2 న విశాఖపట్నంలో జరుగుతుంది.