IPL 2025: అధికారిక ప్రకటన.. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా ద్రవిడ్

IPL 2025: అధికారిక ప్రకటన.. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా ద్రవిడ్

అనుకున్నదే జరిగింది. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరాడు. ఐపీఎల్ 2025 లో రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నాడు. ద్రవిడ్ ఇటీవలే రాజస్థాన్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడని ESPNcricinfo ఖరారు చేసింది. ప్రస్తుతం విరామంలో ఉన్న ఈ భారత మాజీ ప్లేయర్ 2025 మెగా వేలానికి ముందు ప్లేయర్ రిటెన్షన్‌లపై త్వరలోనే చర్చలు జరపనున్నాడు.
 
భారత జట్టు ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ఉన్న సమయంలోనే టీమిండియా ఇటీవలే టీ20 వరల్డ్ కప్ 2024 గెలుచుకుంది. ఈ ట్రోఫీ తర్వాత భారత జట్టు కోచ్ గా రిటైర్మెంట్ ప్రకటించి.. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో కలవనున్నాడు. 2021 నుండి రాయల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్న కుమార్ సంగక్కర తన పాత్రలోనే కొనసాగుతాడు. ఇదిలా ఉండగా.. ద్రవిడ్ హయాంలో భారత బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న విక్రమ్ రాథోర్‌ను రాయల్స్ ఫ్రాంచైజీ తన అసిస్టెంట్ కోచ్‌గా నియమించుకోవచ్చని ESPNCricinfo తెలిపింది. 

ద్రవిడ్ కు రాజస్థాన్ రాయల్స్ కు మధ్య చక్కని అనుబంధం ఉంది. రాజస్థాన్ రాయల్స్ తరపున కెప్టెన్ గా ఆడిన ఈ మాజీ భారత ప్లేయర్.. 2013లో ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ కు జట్టును ఫైనల్ కు చేర్చాడు. 2012, 2013లో సీజన్‌లలో రాయల్స్ కెప్టెన్ గా ఉన్నాడు. 2014, 2015లో రాజస్థాన్ జట్టు మెంటార్ గా ఉన్నాడు. ఆ తర్వాత టీమిండియా అండర్ 19 జట్టుకు కోచింగ్ ఇవ్వడం.. నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్ అయ్యాడు. నవంబర్ 2021లో రవిశాస్త్రి స్థానంలో టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.