IPL 2025: ఐపీఎల్ 2025.. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..?

IPL 2025: ఐపీఎల్ 2025.. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..?

2024 ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్.. రానున్న సీజన్ కు తమ జట్టు మెంటార్ గా ద్రవిడ్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా వచ్చిన తర్వాత కేకేఆర్ ఫ్రాంచైజీ ద్రవిడ్ ను ఈ రోల్ కోసం సంప్రదించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ద్రవిడ్ ను మెంటార్ గా నియమించుకోవాలని చూస్తోందట.  ఇప్పటికే ఈ భారత మాజీ క్రికెటర్ తో రాజస్థాన్ ఫ్రాంచైజీ చర్చలు జరిపినట్టు సమాచారం. 

ద్రవిడ్ కు రాజస్థాన్ రాయల్స్ కు మధ్య చక్కని అనుబంధం ఉంది. రాజస్థాన్ రాయల్స్ తరపున కెప్టెన్ గా ఆడిన ఈ మాజీ భారత ప్లేయర్.. 2013లో ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ కు జట్టును ఫైనల్ కు చేర్చాడు. 2014, 2015లో రాజస్థాన్ జట్టు మెంటార్ గా ఉన్నాడు. ఆ తర్వాత టీమిండియా అండర్ 19 జట్టుకు కోచింగ్ ఇవ్వడం.. నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్ అయ్యాడు. నవంబర్ 2021లో రవిశాస్త్రి స్థానంలో టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. 

ఇటీవలే వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ను భారత్ గెలిచిన తర్వాత ద్రవిడ్ తన కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. ప్లేయర్ గా, కెప్టెన్ గా అందుకోలేని వరల్డ్ కప్ ను కోచ్ గా సాధించి ఐసీసీ ట్రోఫీ లేని వెలితిని తీర్చుకున్నాడు. అయితే ఇప్పుడు అతని సేవలను కొన్ని ఐపీఎల్ ఫ్రాంఛైజీలు వాడుకోవాలని చూస్తున్నాయి. మరి ద్రవిడ్ ఏ ఫ్రాంచైజీకి వెళ్తాడో మరో కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.