త్వరలో టీమిండియా కొత్త కోచ్ కోసం ప్రకటన విడుదల చేయనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జే షా వెల్లడించారు. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌తో భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. దీంతో కొత్త కోచ్ ను నియమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అయితే, టీమిండియాకు కోచ్ గా కొనసాగాలని.. రాహుల్ ద్రవిడ్ కు ఆసక్తి ఉంటే.. మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని షా చెప్పారు.
మే 9వ తేదీ గురువారం సాయంత్రం బీసీసీఐ కార్యాలయంలో జై షా మీడియాతో మాట్లాడుతూ.. "మరికొద్ది రోజుల్లో కోచ్ పదవికి దరఖాస్తుల కోసం ప్రకటన విడుదల చేస్తాం. వచ్చే జూన్ తో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిస్తుంది. ఒకవేళ కోచ్ గా కొనసాగాలనుకుంటే.. ద్రవిడ్ మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. రాబోయే మూడేళ్లపాటు దీర్ఘకాలిక కొత్త కోచ్ నియమిస్తాం. విదేశాలకు చెందినవారు కూడా కొత్త కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు” అని షా చెప్పారు.
కాగా, రెండేళ్ల కాంట్రాక్ట్‌తో టీమిండియా ప్రధాన కోచ్ గా ద్రవిడ్‌ను బీసీసీఐ నియమించింది. గతేడాది నవంబర్‌లో వన్డే ప్రపంచకప్ అనంరతం ఆయన పదవి కాలం ముగిసింది. అయితే, ద్రవిడ్ తోపాటు ఆయన సహాయక సిబ్బంది పదవులను బీసీసీఐ పొడిగించిన సంగతి తెలిసిందే.
అనుభవమున్న జట్టునే పంపుతున్నాం
జూన్ లో అమెరికా, వెస్టిండీస్ లలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన జట్టును పంపుతున్నట్లు జై షా చేప్పారు. ఇక్కడి కంటే యుఎస్‌ఎలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని.. అందుకే, అన్ని పరిస్థితులలో ఆడగల అనుభవమున్న ఆటగాళ్లను ఎంపిక చేశామన్నారు. నంబర్ 8, 9 వరకు బ్యాటింగ్ లైనప్ ఉండేలా జట్టును ఎంపిక చేశామని షా తెలిపారు.
ఇక, "జట్టు రెండు బ్యాచ్‌లుగా బయలుదేరనుంది. ముందు (ఐపీఎల్ ప్లేఆఫ్‌లు) ఖాళీగా ఉన్నవారు మే 24 న బయలుదేరుతారు. మిగిలిన వారు ఐపీఎల్ ఫైనల్ తర్వాత యుఎస్ బయలుదేరుతారు" అని షా తెలిపారు.