Rahul Dravid: నేను నా కొడుక్కి తండ్రిని మాత్రమే.. కోచ్‌ను కాను: రాహుల్ ద్రావిడ్

Rahul Dravid: నేను నా కొడుక్కి తండ్రిని మాత్రమే.. కోచ్‌ను కాను: రాహుల్ ద్రావిడ్

జూనియర్ స్థాయి క్రికెట్‌‌లో భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్‌ ద్రవిడ్ అద్భుత ప్రదర్శన కనపరుస్తున్న విషయం తెలిసిందే. 18 ఏళ్ల ఈ యువ కెరటం బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ రాణిస్తూ.. తండ్రికి త‌గ్గ త‌నయుడు అనిపించుకుంటున్నాడు. కాకపోతే దీన్ని కొందరు వ్యక్తులు తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారట. 

ద్రవిడ్ కొడుకు కాబట్టే జట్టు పగ్గాలు అప్పగించారని కొందరు, నాన్న ద‌గ్గర కోచింగ్ తీసుకొని ఉంటాడు.. అందుక‌నే అద‌ర‌గొడుతున్నాడని మరికొందరు నోరుపారేసుకుంటున్నారట. ఇవన్నీ ద్రావిడ్ చెవిన పడగా.. మొదటిసారి స్పందించాడు. తన కుమారుడికి శిక్షణ ఇవ్వడం గురించి జియోసినిమా ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ద్రవిడ్.. తాను సమిత్‌‌కు తండ్రిని మాత్రమేనని కోచ్‌ను కానని తెలిపారు.  

"అంద‌రూ సమిత్‌‌కు.. నేను  కోచింగ్ ఇచ్చాన‌ని  అనుకుంటారు. కానీ నేనెప్పుడూ అలాంటి ప్రయ‌త్నం చేయ‌లేదు.  ఎందుకంటే.. ఒకే స‌మ‌యంలో తండ్రిగా, కోచ్‌గా ఉండ‌డం స‌వాల్‌తో కూడుకున్నది. కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉండాల్సి ఉంటుంది. అది తండ్రి పాత్రకు, కోచ్‌ పాత్రకు రెండింటికి కష్టం. అందుకే నేను మా అబ్బాయి పట్ల ఒక పేరెంట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాను. అందులో నేను ఏమి చేస్తున్నానో నాకు తెలియదు.." అని ద్రవిడ్ వెల్లడించారు.

కెప్టెన్ 

కర్ణాటక జానియర్ జట్టుకు సారథ్యం వహిస్తున్న సమిత్‌.. ఇటీవల జరిగిన కూచ్ బెహార్ ట్రోఫీలో జట్టును ఫైనల్‌ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. 7 మ్యాచ్ ల్లో 37.78 సగటుతో 370 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు చేశాడు. అలాగే, రైట్ ఆర్మ్ సీమరైన సుమిత్.. బౌలింగ్‌లోనూ మెప్పించగల సమర్థుడు.