Manu Bhaker: ఒలింపిక్స్‌లో పతకం.. మనుపై ద్రవిడ్ ప్రశంసలు

Manu Bhaker: ఒలింపిక్స్‌లో పతకం.. మనుపై ద్రవిడ్ ప్రశంసలు

పారిస్ ఒలింపిక్స్‌లో మహిళా షూటర్ మను భాకర్ కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. మహిళల 10మీ ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో పతకాన్ని సాధించిన మను.. విశ్వక్రీడల్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. ఒలింపిక్స్‌లో షూటింగ్‌ కేటగిరిలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. దాంతో, ఆమెపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

అద్భుతమైన పోరాటం

ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన షూటర్‌ మను బాకర్‌‌పై భారత మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ ప్రశంసలు కురిపించారు. ఆమె విజయాన్ని అద్భుత పోరాటంగా వర్ణించారు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం చేజారిందని నిరాశ చెందకుండా.. ఆమె చూపిన పోరాటపటిమ తనను ఆశ్చర్యపరిచిందని చెప్పుకొచ్చారు. 

"ఇది నమ్మశక్యం కానిది.. టోక్యో ఒలింపిక్స్‌లో ఎదురైన వైఫల్యాన్ని దాటుకొని ఇక్కడామె అద్భుత ప్రదర్శన చేసింది. కాంస్య పతకం సాధించింది. ఎన్నో త్యాగాలు, కఠిన శ్రమతోనే ఈ విజయం సాధ్యమవుతుంది. ఈ క్రీడల కోసం ఎంతటి ఒత్తిడిని ఎదుర్కొంటారో మాకు తెలుసు. ఆమె విజయం స్ఫూర్తిదాయకం. ఎంతోమందిలో ప్రేరణ నింపుతుంది.." అని ద్రవిడ్‌ మెచ్చుకున్నారు.

గన్‌లో సాంకేతిక లోపం

కాగా, 2021లో టోక్యో ఒలింపిక్స్‌లో మను ఇదే ఈవెంట్‌ క్వాలిఫికేషన్ రౌండ్‌లో తన పిస్టల్ పనిచేయకపోవడంతో నిరాశతో వెనుదిరిగింది. చివరి నిమిషంలో గన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఒత్తిడిలో కూరుకుపోయి విలువైన సమయాన్ని కోల్పోయింది. ఫలితంగా ఫైనల్‌కు దూరమయ్యింది. కానీ, ఇప్పుడు మను గురి తప్పకుండా తూటా పేల్చి.. పతకాన్ని సాధించింది.