గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత తీవ్ర నిరుత్సాహానికి గురైన రాహుల్ ద్రవిడ్ అప్పుడే కోచింగ్ బాధ్యతలు వదిలేద్దామని అనుకున్నాడు. కానీ, మరికొంత కాలం కోచ్‌గా కొనసాగాలంటూ రోహిత్ శర్మ అతనికి ఫోన్ చేయడంతో మనసు మార్చుకున్నాడు. ఒకవేళ రోహిత్ నుంచి ఫోన్ రాకపోయి ఉంటే వెస్టిండీస్ గడ్డపై ఈ చారిత్రక ఘనతలో ద్రవిడ్ భాగం అయ్యేవాడు కాదు.
‘నవంబర్‌లో నాకు ఫోన్ చేసి కోచ్‌గా కొనసాగమని కోరిన రోహిత్‌కు చాలా థ్యాంక్స్. మీలో ప్రతి ఒక్కరితో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. కానీ సరైన సమయంలో నన్ను ఒప్పించిన రోహిత్‌కు స్పెషల్ థ్యాంక్స్’ అని వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ద్రవిడ్ తన ప్రసంగంలో పేర్కొన్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో సమష్టిగా ఆడుతూ, మెరుగైన పెర్ఫామెన్స్ చేసిన ఆటగాళ్లను ద్రవిడ్ అభినందించాడు.
‘మీ అందరికీ ఈ క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయి. మేము ఎప్పుడూ చెబుతుంటాం.. మీ కెరీర్‌లో మీరు చేసిన పరుగులను, వికెట్లను గుర్తుంచుకోరు. ఇలాంటి అద్భుత క్షణాలే మీకు తీపి జ్ఞాపకాలుగా నిలుస్తాయి. కాబట్టి ఈ క్షణాన్ని ఆస్వాదిద్దాం. ఫైనల్లో మీరు పుంజుకున్న తీరు, మీ పోరాటం, ఒక జట్టుగా పని చేసిన విధానం చూసి నేను ఎంతగానో గర్విస్తున్నా. గతంలో మనం ట్రోఫీలకు దగ్గరగా వచ్చి ఓడి నిరాశ చెందాం. విజయ గీతను ఎప్పుడూ దాటలేకపోయాం. కానీ, ఈ సారి అనుకున్నది సాధించాం’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.