న్యూఢిల్లీ : సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలవాలంటే కొద్దిగా అదృష్టం కూడా కలిసి రావాలని టీమిండియా చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. 31 ఏళ్ల కలను నెరవేర్చుకునేందుకు ఈసారి మరింత ఎక్కువ శ్రమిస్తామన్నాడు. ‘ఓ రెండుసార్లు సిరీస్ విజయానికి చాలా దగ్గరగా వచ్చాం. కానీ అందుకోలేకపోయాం. సఫారీ గడ్డపై మంచి క్రికెట్ కూడా ఆడాం. కొన్ని క్లిష్టమైన పరిస్థితులను మాకు అనుకూలంగా మల్చుకోలేకపోయాం. ఈసారి అలాంటి అవకాశాలను ఛేదిస్తామనే భావిస్తున్నాం. గత సిరీస్‌లో మేం బౌలింగ్ బాగా చేశాం. అదే కాన్ఫిడెన్స్‌ను ఈసారి కూడా కొనసాగిస్తాం.
ఈ పిచ్‌లపై 20 వికెట్లు తీయగల సామర్థ్యం మాకు ఉందనే నమ్ముతున్నా. ఏదేమైనా ఇక్కడ సిరీస్ నెగ్గాలంటే కాస్త లక్ కూడా కలిసి రావాలె. ఒక్క చాన్స్‌ను మిస్ చేసుకున్నా ప్రత్యర్థులు దాంతోనే పట్టు సాధిస్తున్నారు. కాబట్టి ఈసారి అలాంటి అవకాశాలను వదిలిపెట్టబోం’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు. సరైన ఏరియాలో బాల్స్ వేయడంతో పాటు గంటలకొద్దీ క్రీజులో పాతుకుపోయే లక్షణం ఉంటే ఇక్కడ మ్యాచ్‌లు నెగ్గొచ్చన్నాడు. ప్రతి బ్యాటర్ 30, 40 స్కోరుకు చేరాకా దాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని సూచించాడు. టెస్ట్ డెబ్యూ చేసిన పేసర్ ప్రసిధ్ కృష్ణలో మంచి స్కిల్స్ ఉన్నాయని ద్రవిడ్ తెలిపాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎక్కువ ఆడకపోయినా టెస్ట్‌లకు సరిపోయే నైపుణ్యం ఉందని కితాబిచ్చాడు.