భువనేశ్వర్: బీజేపీ దేశ రాజ్యాంగాన్ని మార్చి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్‌లను రద్దు చేయాలనే కుట్ర చేస్తున్నదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈసారి బీజేపీ గెలిస్తే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి, దేశం మొత్తాన్ని 22 మంది బిలియనీర్ల చేతుల్లోపెడుతుందన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ బుధవారం..ఒడిశాలోని బోలంగిర్ లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని, మాట్లాడారు. " ఈ పుస్తకాన్ని(రాజ్యాంగం) చించివేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది.
కానీ అందుకు దేశ ప్రజలు, కాంగ్రెస్ అస్సలు అంగీకరించవు. దేశంలోని పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, రైతులు, కూలీలు ఇంతవరకు ఏం పొందారో అవన్నీ వారికి రాజ్యాంగం వల్లే లభించాయి. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేసి, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తుంది. దాని వల్ల దేశాన్ని 22 మంది కోటీశ్వరులు నడిపిస్తారు. ఇది జరగకుండా ఉండాలంటే దేశంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తప్పనిసరి "అని రాహుల్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పై ఫేక్ ప్రచారం చేస్తున్నరు
జూన్ 4 తర్వాత నరేంద్ర మోదీ ప్రధాని కాలేరని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ అబద్ధాలతో తమపై ఎంత తప్పుడు ప్రచారం చేసినా ఫలితం ఉండబోదని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఎన్నికల ర్యాలీలో తను చేసిన కామెంట్లను బీజేపీ వక్రీకరించిందన్నారు. బీజేపీ రిలీజ్ చేసిన వీడియో ఫేక్ అని చెప్పారు. "అబద్ధాల కంపెనీ ద్వారా బీజేపీ ఎంత తప్పుడు ప్రచారం చేసినా ఎలాంటి మార్పు రాదు. మళ్లీ చెబుతున్నాను.-- జూన్ 4 తర్వాత మోదీ ప్రధాని కాలేరు" అని రాహుల్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. దానికి ఉత్తరప్రదేశ్‌లోని ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన అసలు వీడియోను జత చేశారు. ఇండియా కూటమికి అనుకూలంగా దేశంలోని ప్రతి మూల నుంచి పవనాలు వీస్తున్నాయన్న రాహుల్..ఈసారి బీజేపీని అధికారానికి దూరం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రైతు రుణమాఫీ మరిచారు
బీజేపీ సర్కార్ దేశంలోని 22 మంది బిలియనీర్లకు రూ. 16 లక్షల కోట్ల విలువైన రుణమాఫీ చేసిందని..రైతు రుణమాఫీ మాత్రం మరిచిందని రాహుల్ విమర్శించారు. బిలియనీర్లకు చేసిన రూ. 16 లక్షల కోట్ల రుణమాఫీతో ఉపాధి కూలీలకు24 ఏండ్ల పాటు వేతనాలు ఇవ్వచ్చని చెప్పారు. పారిశ్రామికవేత్తలకు విమానాశ్రయాలను అప్పగించడం, ప్రైవేట్ సంస్థలకు డిఫెన్స్ కాంట్రాక్టులు ఇవ్వడాన్నే బీజేపీ అభివృద్ధిగా చూపుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు దేశ సంపదను జనాభా కు అనుగుణంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. అందుకే కులగణన చేపడతామన్నారు. జన గణన తర్వాత దేశంలో విప్లవాత్మక ప్రజాస్వామ్యం, ప్రజారాజ్యం ప్రారంభమవుతుందని రాహుల్ వివరించారు.