- 90% ఉన్న వర్గాలు దేశాన్ని పాలించాలి: రాహుల్
- బీజేపీ ఆ వర్గాలకు అధికారాన్ని, హక్కుల్ని దూరం చేస్తున్నది
- ప్రజల్ని మత ప్రాతిపదికన విభజిస్తున్నదని ఫైర్
- మణిపూర్‌ను తగలబెట్టింది
- అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తమని హామీ
సిమ్డేగా, లోహర్దాగ(జార్ఖండ్): ఓబీసీ, దళిత, ఆదివాసీ వర్గాల కోసం గొంతెత్తడం తప్పైతే.. ఆ తప్పును చేస్తూనే ఉంటానని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. దేశంలో 90 శాతం ఉన్న వర్గాలను పరిపాలనలో భాగస్వాముల్ని చేసేందుకు, దేశాన్ని ఒక్కటి చేసేందుకు, బలోపేతం చేసేందుకు పోరాడుతానని చెప్పారు. బీజేపీ దేశ ప్రజలను మత ప్రాతిపదికన విభజిస్తున్నదని.. ఆ పార్టీ మణిపూర్ రాష్ట్రాన్ని తగలబెట్టిందని ఆరోపించారు. ప్రధాని మోదీ ఆ రాష్ట్రాన్ని కనీసం సందర్శించలేదని విమర్శించారు.
శుక్రవారం రాహుల్ గాంధీ జార్ఖండ్‌లోని సిమ్డేగా, లోహర్దాగలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 90% ఉన్న వర్గాలకు దక్కాల్సిన అధికారం, హక్కులు, ప్రయోజనాలను బీజేపీ దూరం చేస్తోందని ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేస్తామన్నారు. ఆయా వర్గాలకు దేశ సంపద, పరిపాలనలో వారి వాటా వారికి ఇచ్చేందుకే కులగణన చేపడుతున్నామని చెప్పారు.
“దళితులు, ఆదివాసీలు, ఓబీసీల కోసం నేను గళం విప్పగానే.. దేశాన్ని విభజిస్తున్నానని బీజేపీ ఆరోపిస్తున్నది. నేను భారత్‌ను ఏకం చేయడానికి, బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న. ఓబీసీలు, గిరిజనులు, దళితుల కోసం నేను గొంతు ఎత్తడం తప్పు అయితే.. పరిపాలనలో వారి భాగస్వామ్యం కోసం ఆ తప్పును చేస్తూనే ఉంటాను’’ అని అన్నారు. జార్ఖండ్‌లో అధికారంలోకి రాగానే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీల రిజర్వేషన్లను పెంచుతామని పేర్కొన్నారు.
‘రుణ మాఫీ’ రైతులకు చేస్తేనే నష్టమా?
మోదీ ప్రభుత్వం కేవలం 25 మంది కార్పొరేట్లకు రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసింది.. కానీ దేశంలో ఒక్క రైతుకు ఒక్క రూపాయి మాఫీ చేయలేదని రాహుల్ అన్నారు. యూపీఏ హయాంలో రైతుల రుణాల కోసం నిర్ణయించిన మొత్తాన్ని కూడా రూ.72 వేల కోట్లకు తగ్గించిందని ఆరోపించారు. ‘బీజేపీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందా?... మీరు ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు కనుకే చేయలేదు. పెట్టుబడిదారుల రుణాలను మాఫీ చేసే బీజేపీ మీ అప్పులను మాత్రం ఎప్పటికీ మాఫీ చేయదు. రైతుల రుణమాఫీ విషయం వచ్చే సరికి వ్యవసాయ రుణ విధానం దెబ్బతింటుందని గగ్గోలు పెడుతున్నది.. మరి కార్పొరేట్లకు మాఫీ చేస్తే వారి రుణ విధానం దెబ్బతినదా’ అని ప్రశ్నించారు.
బీజేపీ సిద్ధాంతం అదే..
ఈ దేశాన్ని 90% ఉన్న వర్గాలు పాలించాలని తాను కోరుకుంటున్నానని రాహుల్ అన్నారు. “కొద్ది మంది వ్యక్తులు మాత్రమే దేశాన్ని నడపాలని బీజేపీ కోరుకుంటున్నది. 10 నుంచి 15 మంది వ్యక్తులు శాసించాలని ఆ పార్టీ భావిస్తున్నది. దేశ సంపద, భూమి, అడవి, ఖనిజాలు లాంటి వనరులపై అధికారాన్ని వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నది” అని ఆరోపించారు. కేంద్రం కేవలం 90 మంది అధికారుల కనుసన్నల్లో నడుస్తున్నదని తెలిపారు. ఈ అధికారులే దేశం మొత్తం బడ్జెట్‌కు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారన్నారు. వారంతా ఒకటిరెండు వర్గాలకు చెందిన వారని అన్నారు.
ఆదివాసీల నుంచి ‘జల్, జంగిల్, జమీన్’ గుంజుకునే ప్రయత్నం
అభివృద్ధి పేరుతో ఆదివాసీల నుంచి ‘జల్, జంగిల్, జమీన్’ గుంజుకుని బిలియనీర్లకు వాటిని కట్టబెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని రాహుల్ ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే ఆర్‌ఎస్‌ఎస్, -బీజేపీ టార్గెట్ అన్నారు. ఇండియా కూటమి రాజ్యాంగాన్ని రక్షించేందుకు పోరాడుతున్నదని చెప్పారు.