దేశమంతా కులగణనే రాహుల్‍ లక్ష్యం : మంత్రి సురేఖ

దేశమంతా కులగణనే రాహుల్‍ లక్ష్యం : మంత్రి సురేఖ
  • ఆదివాసీ కాంగ్రెస్‍ బునియాడీ కార్యకర్తల సమ్మేళనంలో మంత్రి సురేఖ
  • పాల్గొన్న ఉమ్మడి వరంగల్‍ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు

వరంగల్‍, వెలుగు: దేశమంతా కులగణన చేపట్టి, జనాభా ఆధారంగా ఆయా వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్‍ అగ్రనేత రాహుల్‍ గాంధీ అడుగులు వేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్‍ బునియాడీ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్ర ట్రైకార్‍ చైర్మన్‍ బెల్లయ్య నాయక్‍, ఎంపీలు కడియం కావ్య, బలరాం నాయక్‍, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‍రెడ్డి, దొంతి మాధవరెడ్డి, రామచంద్రునాయక్‍, మురళీ నాయక్​తో కలిసి మంత్రి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో రాజ్యాంగానికి రక్షణలేని పరిస్థితి నెలకొందన్నారు. జనాభాలో 56 శాతమున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్యాయం జరుగుతుండగా, 3–4 శాతం ఉన్న అగ్రకులాలు పెత్తనం చలాయించడమేంటని ప్రశ్నించారు. రాజ్యాంగం, కులగణన విషయంలో ఇంతపెద్ద చర్చ జరుగుతుంటే.. ప్రధాని మోదీ ఏం మాట్లాడకుండా నిమ్మకునీరెత్తినట్లుగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. 

రాజ్యాంగం లేకుంటే.. మాకు గెలిచేంత సీన్ లేదు: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రాజ్యాంగంలో తమకు రాజకీయ రిజర్వేషన్లు లేకుంటే.. తనతో పాటు రామచంద్రు నాయక్‍, బలరాం నాయక్‍, మురళీ నాయక్​కు ఎంపీలు, ఎమ్మెల్యేలయ్యేంత సీన్‍ లేదని స్టేషన్‍ ఘన్‍పూర్‍ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రిజర్వేషన్లు లేకుంటే గిరిజన దళితులకు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలుగానూ అవకాశం వచ్చేది కాదన్నారు. దళితులు జై శ్రీరామ్​తో పాటు జై భీమ్​అంటూంటే.. అమిత్‍షా వంటి బీజేపీ బడా నేతలు ‘జై శ్రీరాం అంటున్నరు తప్పితే జై భీం’ అనట్లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో రక్షణ శాఖను కూడా త్వరలో ప్రైవేటుపరం చేయబోతోందన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అంబేడ్కర్‍ను అడుగడుగున అవమానిస్తోందన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.