మేడిగడ్డకు రాహుల్ గాంధీ.. పర్యటనకు పోలీసులు అనుమతి ఇస్తారా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ ఘటన రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగిపోవటం బీఆర్ఎస్ ను ఇరుకున పెడుతోంది. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపిస్తోంది. 

తాజాగా రాహుల్ గాంధీ కూడా మరోసారి అవే విమర్శలు చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ.. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల బృందంతో కలిసి గురువారం (నవంబర్ 2వ తేదీన) మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు వెళ్లనున్నారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ నేతలతో కలిసి పరిశీలించాలని నిర్ణయించారు. 

అయితే..  మేడిగడ్డ ప్రాంతంలో రాహుల్ పర్యటన కొనసాగుతుందా..? లేదా అనేది ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే.. మేడిగడ్డ ప్రాంతానికి ఎవర్నీ పోలీసులు అనుమతించడం లేదు. మరి ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులను అనుమతిస్తారా..? లేదా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన తర్వాతే రాహుల్ గాంధీ అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.