- మీడియాతో చిట్ చాట్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 27న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాష్ట్రా నికి రానున్నట్లు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ వెల్లడించారు. శనివారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించనున్న ‘సంవిధాన్ బచావో’ యాత్రలో వారు పాల్గొంటారని చెప్పారు. ఈ నెలాఖరులోపు పీసీసీ కార్యవర్గంతోపాటు పార్టీ పదవులన్నింటినీ భర్తీ చేస్తామన్నారు. కార్పొరేషన్ పదవులు, కమిషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పదవులను ప్రకటించేందుకు సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నార ని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ తన పరిధిలో లేని అంశమని, అది సీఎం, పార్టీ హైకమాండ్ చూసుకుంటుందన్నారు.
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని, ఆయా జిల్లాల నుంచి నలుగురు, ఐదుగురు అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నారని చెప్పారు. అయితే ఆ జిల్లా పరిధి మంత్రి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను తీసుకొని తుది నివేదికను హైకమాండ్ కు అందజేస్తామన్నారు. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో ఎవరికి మద్దతివ్వాలనే విషయంలో ఏఐసీసీ ఇన్చార్జి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్, మంత్రుల అభిప్రాయం తీసుకుంటామని చెప్పారు. ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై మహేశ్ గౌడ్ స్పందస్తూ.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
రానున్న 20 ఏండ్లను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రాష్ట్ర పార్టీ నేతలకు గట్టిగా చెప్పారని, రాష్ట్రంలోని ప్రతి నేత పనితీరుపై ఆయన దగ్గర రిపోర్టు ఉందన్నారు. ఈ నెల 15న ఢిల్లీలో ఏఐసీసీ ఆఫీస్ ప్రారంభోత్సవం ఉందని, 14న ఢిల్లీ వెళ్లనున్నట్లు చెప్పారు. అంతకు ముందు పార్టీ ఆఫీస్‌లో లాల్ బహుదూర్ శాస్త్రీ వర్థంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి పీసీసీ చీఫ్ నివాళులు అర్పించారు. నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత డీవీ సత్యనారాయణ గాంధీ భవన్లో మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.