
- ‘ఎక్స్’లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ పోస్ట్
- బీసీ రిజర్వేషన్ల బిల్లు సామాజిక న్యాయం వైపు విప్లవాత్మకమైన అడుగు
- ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చిందని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్త కులగణనకు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ మార్గం చూపిందని లోక్సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అన్నారు. ఈ కులగణన దేశానికి అవసరమని, తాము దీన్ని పూర్తి చేసి చూపిస్తామన్నారు. ఈ దిశలో తెలంగాణలో ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని గుర్తుచేశారు. ఈ నిర్ణయం రాష్ట్రంలో సామాజిక న్యాయం వైపు విప్ల వాత్మక అడుగు అని వ్యాఖ్యానించారు.
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పెట్టిన బిల్లు ఆమోదంపొందడంపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు. ‘తెలంగాణలో ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది. రాష్ట్రంలో శాస్త్రీయ పద్ధతితో జరిగిన కులగణనలో ఓబీసీల లెక్క ఆమోదం పొందింది. అలాగే విద్య, ఉద్యోగ, రాజకీయాలలో సమాన భాగస్వామ్యం ఉండేలా అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది.
ఇది నిజంగా సామాజిక న్యాయం వైపు విప్లవాత్మక అడుగు. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లపై 50 శాతంగా ఉన్న అడ్డంకి తొలగింది. కులాల సర్వే డేటాతో ప్రతివర్గం సామాజిక, ఆర్థిక స్థితిగతులను విశ్లేషించవచ్చు. తద్వారా ఆయా వర్గాల అభివృద్ధికి పాలసీలు రూపొందించబడతాయి. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర నిపుణుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది’ అని పేర్కొన్నారు.
ఎక్స్–రే(కుల గణన) ద్వారానే వెనుకబడిన, అణగారిన వర్గాలు తమ హక్కులు పొందగలవని తాను నిరంతరం చెబుతున్నట్లు రాహుల్ గుర్తుచేశారు. ఈ విషయంలో తెలంగాణ దేశానికి మార్గాన్ని చూపిం దని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇది యావత్ దేశా నికి అవసరమన్నారు. తప్పకుండ దేశ వ్యాప్తంగా కుల గణన జరుగుతుందని, దాన్ని తాము పూర్తి చేసి చూపిస్తామన్నారు.
మరో హామీని నెరవేర్చాం: ప్రియాంక
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో హామీని నెరవేర్చిందని ప్రియాంక గాంధీ అన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బీసీ బిల్లులతో వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలు ఇప్పుడు 42% రిజర్వేషన్లు పొందగలరని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘నా తెలంగాణ సోదర, సోదరీమణులారా.. మీకు అభినందనలు.. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇచ్చి హామీని నెర వేర్చాం.
ఇది సామాజిక న్యాయం కోసం తీసుకున్న చాలా ముఖ్యమైన అడుగు. ఇది మిమ్మల్ని సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. మేము ఎల్లప్పుడూ మీతోనే, మీ కోసమే ఉంటాం’ అని రాసుకొచ్చారు.