టార్గెట్ జగన్... కడప జిల్లాకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి..

2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరుతోంది. రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే, కడప జిల్లా రాజకీయాలు మాత్రం మరో రేంజ్ లో ఉన్నాయి. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడపలో ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. గత ఎన్నికల్లో జిల్లాలో ఒక్క సీటు కూడా సాధించలేకపోయిన టీడీపీ ఈసారి వైసీపీ జోరుకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తోంది. మరోపక్క జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల కడప ఎంపీగా బరువులో దిగి జగన్, అవినాష్ రెడ్డిలపై ప్రత్యక్షంగా విమర్శలు చేస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది.

ఇదిలా ఉండగా, షర్మిలకు మద్దతుగా రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 7న కడపలో షర్మిలకు మద్దతుగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ సభలో రాహుల్, రేవంత్ వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు, కాంగ్రెస్ ల మధ్య చీకటి ఒప్పందం ఉందంటూ సీఎం జగన్ సహా వైసీపీ శ్రేణులు చేస్తున్న ఆరోపణలపై రేవంత్, రాహుల్ ఎలా స్పందిస్తారు, ఎన్డీయేతో జతకట్టిన చంద్రబాబుపై రాహుల్ విమర్శలు చేస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

పీసీసీ చీఫ్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ జగన్, అవినాష్ రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది షర్మిల. కాగా, షర్మిల టీడీపీ ట్రాప్ లో పడి జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ నే ఎన్నికల ప్రచారంలో చదువుతున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న సీఎం జగన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రిమోట్ చంద్రబాబు చేతిలో ఉందని, రేవంత్ రెడ్డిని చంద్రబాబు డైరెక్ట్ చేస్తోంటే, షర్మిలను రేవంత్ డైరెక్ట్ చేస్తున్నారని అన్నారు.ఈ నేపథ్యంలో జగన్ పై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి