రాహుల్​గాంధీ ప్రధాని కావడం ఖాయం: మంత్రి ఉత్తమ్​

  • ఏఐసీసీ కొత్త ఆఫీసు చరిత్రాత్మక ఘట్టం

న్యూఢిల్లీ, వెలుగు: కొత్త భవనంలోకి ఏఐసీసీ ఆఫీసు మారడం చరిత్రాత్మక ఘట్టమని మంత్రి ఉత్తమ్​కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు. ప్రజలందరికీ సామాజిక న్యాయం, సమీకృత అభివృద్ధి, రాజ్యాంగ పరిరక్షణ అనే మూలసూత్రాలతో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పనిచేస్తున్నదని తెలిపారు. ఏఐసీసీ కొత్త ఆఫీసు ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్​ మీడియాతో మాట్లాడారు. నూతన కార్యాలయం నుంచి ప్రారంభించే కార్యక్రమాలు విజయవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ గెలవడం, రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

త్యాగాలు ప్రతిబింబించేలా ఆఫీసు: షర్మిల

దేశస్వాతంత్య్ర పోరాటం నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ నాయకులు చేసిన త్యాగాలను ప్రతిబింబించేలా పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించారని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లెగసీ తెలియజేసేలా ఆఫీసు ఉందని మీడియాతో ఆమె పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ చరిత్రనంతా ప్రతి ఒక్కరికీ తెలిసేలా నూతన భవనంలో పొందుపరిచారు. నూతన భవనం ప్రతి ఒక్క కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కార్యకర్తకు గర్వకారణం. దేశం కోసం పోరాటం చేస్తున్న రాహుల్‌‌‌‌‌‌‌‌గాంధీ టీంలో మేం భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉంది” అని తెలిపారు. కాగా, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసు ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,  పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మహేశ్​కుమార్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, ఎంపీలు మల్లు రవి, సురేశ్​ షెట్కార్‌‌‌‌‌‌‌‌, రఘువీర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, నేతలు గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, వంశీచంద్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సంపత్​కుమార్‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.