ఏపీ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ రాహుల్ ట్వీట్

ఏపీ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ రాహుల్ ట్వీట్
  • కర్ణాటకలో ప్రవేశించి ఉత్సాహంగా సాగుతున్న రాహుల్ యాత్ర
  • ఆదివారం తెలంగాణలో ప్రవేశించనున్న రాహుల్ యాత్ర

కర్నూలు జిల్లా: ఏపీలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసింది. ఇవాళ ఉదయం మంత్రాలయం సమీపంలో తుంగభద్ర నది బ్రిడ్జి మీదుగా కర్ణాటకలోకి ప్రవేశించారు. ఏపీలో యాత్ర ముగిసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీలో భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభించిందని సంతృప్తిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. 

ఆంధ్రప్రదేశ్ గుండా నా ప్రయాణం సందర్భంగా ప్రజలు తమ అపారమైన మద్దతు, ప్రోత్సాహాన్ని అందించినందుకు ధన్యవాదములు తెలిపారు. యాత్రలో  ప్రజలను ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంతోపాటు అమరావతి రాజధానిని అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అలాగే భారతీయ ప్రజల ఆస్తిగా విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ హోదాను కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని.. అలాగే రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా నిర్వీర్యం చేస్తోందని.. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఈ దాడిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తాను గమనించానని రాహుల్ గాంధీ వివరించారు. 

2014లో పార్లమెంటులో ఏపీ ప్రజలకు చేసిన వాగ్దానాలకు, ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని.. హామీలు నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని రాహుల్ విమర్శించారు. ఏపీలో ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి కాంగ్రెస్ పార్టీకి తెలుసునని.. దేశానికి ఎంతో మంది అత్యుత్తమ నేతలను అందించిన ఏపీ ప్రజల హృదయాలలో కాంగ్రెస్ పార్టీ పూర్వ స్థానాన్ని చేరుకోవడానికి చేయగలిగినంతా చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఈ ప్రయాణం భారత్ జోడో యాత్ర మొదటి అడుగుగా నిలుస్తుందని తాను నమ్ముతున్నానని.. కేవలం కొద్దిమంది చేతుల్లో రాజకీయ, ఆర్ధిక శక్తి కేంద్రీకృతం కావడం తీవ్ర అందోళన కలిగించే అంశం అన్నారు. 

 

చిన్నారిని భుజాలమీద ఎత్తుకుని పాదయాత్ర: వీడియో వైరల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద పాదయాత్ర మొదలుపెట్టి కర్ణాటకలోకి ప్రవేశించింది. ఏపీలో మంచి ఆదరణ లభించిన జోష్ తో రాహుల్ ఇవాళ ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొన్నారు.  ఇవాళ్టి పాదయాత్రలో రాహుల్ గాంధీ ఓ చిన్నారిని ఎత్తుకున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

తన భుజాలపై చిన్నారిని ఎత్తుకుని నడిచారు రాహుల్. కాసేపు పాపతో సరదాగా మాట్లాడి.. చాక్లెట్ ఇచ్చారు. ఈ వీడియోను కాంగ్రెస్ శ్రేణులు ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ.. పిల్లల పట్ల రాహుల్ ప్రేమ వెలకట్టలేనిదని.. మరో చాచా నెహ్రూ అంటూ పోస్టులు పెడుతున్నారు. కూతుర్లే సమాజానికి పునాదులని కామెంట్లు పెడుతున్నారు. చిన్నాపెద్ద అందరినీ.. రాహుల్ అప్యాయంగా పలకరిస్తున్న వీడియోలు.. రాహుల్ ను ముసలోళ్లు అప్యాయంగా పలకరిస్తూ ముద్దు పెట్టి, ఆలింగనం చేసుకుంటున్న ఎమోషనల్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవుతున్నాయి.