హనుమంతున్ని దర్శించుకుని పాదయాత్ర ప్రారంభించిన రాహుల్

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పునఃప్రారంభమైంది. 9 రోజుల విరామం తర్వాత ఢిల్లీలోని కశ్మీరీ గేట్ వద్ద ప్రారంభమైన యాత్ర ఉత్తరప్రదేశ్లోకి అడుగుపెట్టనుంది. ఢిల్లీ యమునా బజార్ లోని హనుమాన్ ఆలయంలో పూజల అనంతరం రాహుల్ పాదయాత్ర ప్రారంభించారు. భారత్ జోడో యాత్ర ఇవాళ్టితో 3వేల కిలోమీటర్ల మైలురాయికి చేరనుంది. గత ఏడాది సెప్టెంబర్ 7న తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన రాహుల్ యాత్ర... తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల మీదుగా సాగింది. 

భారత్ జోడో యాత్ర ఈ నెల 26న జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ లో ముగియనుంది. ఈ యాత్ర ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ‘హాత్ సే హాత్ జోడో’ ప్రచారాన్ని ప్రారంభించనుంది. హాత్ సే హాత్ జోడో ప్రచార కార్యక్రమం బాధ్యతను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీకి అప్పగించారు. భారత్ జోడో యాత్ర సందేశాన్ని మహిళల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రియాంకగాంధీ ర్యాలీలు చేపట్టనున్నారు. పెరుగుతున్న ధరలకు నిరసనగా ప్రియాంకగాంధీ మహిళలతో కలిసి ర్యాలీల్లో పాల్గొననున్నారు.  హాత్ సే హాత్ జోడో  ప్రచారం రెండు నెలలపాటు కొనసాగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.