కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారిలో ప్రారంభమైంది. ఈ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సీఎంలు  పాల్గొన్నారు. అంతకుముందు ఇవాళ మధ్యాహ్నం 3.05 గంటలకు తీరువల్లూర్ మెమోరియల్ ను, 3.25గంటలకు కామరాజ్ మెమోరియల్‌ను రాహుల్ సందర్శించారు. సాయంత్రం 4.10గంటలకు మహాత్మాగాంధీ మండపం వద్ద ప్రార్థనలో పాల్గొన్నారు. సాయంత్రం 4.30 గంటలకు మహాత్మాగాంధీ మండపంలో జాతీయ జెండా అందజేత కార్యక్రమంలో భాగంగా..  రాహుల్ గాంధీకి తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ జాతీయ జెండాను అందించారు.

‘మనమందరం భారత్ ను ఏకం చేద్దాం’..

ఇవాళ మధ్యాహ్నం 4.40 గంటలకు భారత్ జోడో యాత్రికులతో కలిసి మహాత్మా గాంధీ మండపం నుంచి బీచ్ రోడ్ వరకు జరిగే మార్చ్ లో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. ‘మనమందరం భారత్ ను ఏకం చేద్దాం’ అనే నినాదంతో భారత్ జోడో యాత్ర ముందుకు సాగుతుందని రాహుల్ తెలిపారు. భారత్ జోడో యాత్ర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సభలో కాంగ్రెస్ సీనియర్ నేతలు చిదంబరం, దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున ఖర్గే తదితరులు మాట్లాడారు.  ఇక ఈ యాత్రలో భాగంగా రేపు (సెప్టెంబరు 8) ఉదయం 7 గంటల నుంచి రాహుల్ గాంధీ నడకను మొదలుపెట్టనున్నారు. రోజుకు సగటున 25 కిలోమీటర్లు రాహుల్ నడవనున్నారు. ప్రతిరోజూ రెండు విడతల్లో యాత్ర జరుగుతుంది. తమిళనాడు రాష్ట్రంలో 4 రోజులపాటు యాత్ర కొనసాగనుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన 117 మంది నేతలు రాహుల్ గాంధీ వెంట భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు.

150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల మేర.. 

‘భారత్ జోడో’ కార్యక్రమం ద్వారా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుదీర్ఘ పాదయాత్రకు రాహుల్ సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను కదలించేలా ఈ యాత్ర ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 150 రోజుల (5 నెలలు)  పాటు 3,570 కిలోమీటర్ల మేర.. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ భారత్ జోడో యాత్ర కొనసాగనుంది.  

తెలంగాణలో ..

తెలంగాణలో భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ లో స్వల్ప  మార్పులు జరిగాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం 13 రోజుల పాటు జరగాల్సిన యాత్రను మరో రెండు రోజులు పెంచారు. మొత్తం  15 రోజులపాటు  350 కిలోమీటర్ల మేర రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర జరుగుతుంది. రాహుల్ గాంధీ పాదయాత్ర అక్టోబర్ 24వ తేదీన రాష్ట్రంలోరీ ప్రవేశించనుంది. మక్తల్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణా బ్రిడ్జి గుండా పాదయాత్ర ఎంటర్ అవుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మక్తల్ నుంచి మొదలై  దేవరక్రద, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ముత్తంగి, సంగారెడ్డి, జోగిపేట, శంకరం పేట, మద్నూర్ ల గుండా రాహుల్ యాత్ర సాగనుంది.