
- ప్రైవేట్ బడుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం
- మూడు కీలక తీర్మానాలను ఆమోదించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: ‘న్యాయ్ పథ్’ తీర్మానాలను కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. అహ్మదాబాద్ లోని సబర్మతీ నది ఒడ్డున జరిగిన ఏఐసీసీ సమావేశంలో చివరి నిమిషంలో ఈ తీర్మానాలను పాస్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, సీనియర్ లీడర్లు జైరాం రమేష్, శశిథరూర్, ఆనంద్ శర్మ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మూడు తీర్మానాలను చేశారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని రద్దుచేయాలని, జాతీయ స్థాయిలో చట్టం చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకురావాలని, జనాభా ఆధారంగా వివిధ వర్గాల వారికి బడ్జెట్ లో నిధులు కేటాయించాలని మూడు కీలక తీర్మానాలు చేశారు.
అలాగే, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా చట్టం తెస్తామని పేర్కొన్నారు. ఇక వక్ఫ్ బోర్డు చట్టం సవరణపైనా సమావేశంలో చర్చించారు. దేశంలోని ముస్లింలు, క్రిస్టియన్ల భూమలు ఆక్రమించేందుకు ప్రయత్నం జరుగుతున్నదని నేతలు పేర్కొన్నారు. దేశంలోని మైనారిటీలు భయంతో, అభద్రతాభావంతో బతికే పరిస్థితులు కల్పించారని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాగా, ‘న్యాయ్ పథ్’ తీర్మానాలపై రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో స్పందించారు. బహుజనులకు సామాజిక న్యాయం చేకూర్చడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ‘‘ఈ దేశంలో నివసిస్తున్న బహుజనులకు మేము స్పష్టమైన సందేశం తెలిపాం. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను అమలు చేయడంతో పాటు రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తాం. ఇందు కోసం జాతీయంగా ఒక చట్టం తెస్తాం” అని పేర్కొన్నారు.