
- బీజేపీకి మెజార్టీ రాదని, ఎగ్జిట్ పోల్స్ తప్పని వాళ్లకు ముందే తెలుసు
- అయినా మార్కెట్ పెరుగుతుందని పదేపదే కామెంట్లు
- ఫలితంగా రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.30 లక్షల కోట్ల నష్టం
- కొంతమంది ఫారిన్ ఇన్వెస్టర్లకు మాత్రం లాభాలు
- జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో భారీ స్కామ్ జరిగిందని.. ఇందులో మోదీ, అమిత్ షా పాత్ర ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘‘స్టాక్ మార్కెట్ భారీగా పెరుగుతుందని ఎన్నికల ఫలితాలకు ముందు మోదీ, అమిత్ షా పదే పదే కామెంట్లు చేశారు. అందుకు తగ్గట్టే ఫేక్ ఎగ్జిట్ పోల్స్ కారణంగా ఈ నెల 3న మార్కెట్ భారీగా పెరిగింది. కానీ ఎలక్షన్ రిజల్ట్ రోజున (4న) మార్కెట్ కుప్పకూలింది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు రూ.30 లక్షల కోట్లు నష్టపోయారు. ఇందులో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. బీజేపీకి మెజార్టీ రాదని తెలిసినప్పటికీ, మార్కెట్ భారీగా పెరుగుతుందని మోదీ, అమిత్ షా కామెంట్లు చేశారు. అది నమ్మి రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్ లో భారీగా పెట్టుబడులు పెట్టారు. కానీ ఎగ్జిట్ పోల్స్ కు, రిజల్ట్స్ కు తేడా ఉండడంతో మార్కెట్ కుప్పకూలి రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు” అని చెప్పారు. గురువారం ఢిల్లీలో మీడియాతో రాహుల్ గాంధీమాట్లాడారు. ఈ స్కామ్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ, అమిత్ షా సహా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సంస్థలపై ఎంక్వైరీ జరిపించాలని కోరారు.
ఇన్వెస్టర్లకు సలహాలు ఇవ్వాల్సిన అవసరమేంటి?
ఎన్నికల టైమ్‌లో మొదటిసారి స్టాక్ మార్కెట్ గురించి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కామెంట్లు చేశారని రాహుల్ తెలిపారు. ‘‘మన స్టాక్ మార్కెట్ దూసుకెళ్తున్నదని మోదీ చెప్పారు. జూన్ 4న రికార్డులు బ్రేక్ చేస్తుందని మే 19న ఆయన కామెంట్ చేశారు. అదే విధంగా జూన్ 4న మార్కెట్ దూసుకెళ్తుందని, అందరూ ఇన్వెస్ట్ చేసుకోవాలని అమిత్ షా సూచించారు. వీళ్లిద్దరి లెక్కనే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడారు” అని చెప్పారు. ‘‘స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని ఇన్వెస్టర్లకు మోదీ, అమిత్ షా సలహా ఇవ్వాల్సిన అవసరమేంటి? అదేమైనా వాళ్ల డ్యూటీనా? స్టాక్ మ్యానిపులేషన్ కేసులో సెబీ విచారణ ఎదుర్కొంటున్న బిజినెస్ గ్రూప్‌కు చెందిన మీడియా సంస్థకే వీళ్లిద్దరు ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చారు? బీజేపీకి, ఫేక్ ఎగ్జిట్
పోల్స్ ఇచ్చిన సంస్థలకు మధ్య సంబంధమేంటి?
అలాగే ఎగ్జిట్ పోల్స్‌కు ఒకరోజు ముందు మన స్టాక్ మార్కెట్లో భారీగా ఇన్వెస్ట్ చేసి లాభాలు ఆర్జించిన ఫారిన్ ఇన్వెస్టర్లకు, బీజేపీకి మధ్య లింక్ ఏంటి?” అని ప్రశ్నించారు. స్టాక్ మార్కెట్ లో 5 కోట్ల మంది రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోతే, కొంతమంది ఫారిన్ ఇన్వెస్టర్లు మాత్రం లాభపడ్డారని పేర్కొన్నారు. ‘‘ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో మోదీకి, అమిత్ షాకు ముందే తెలుసు. ఎగ్జిట్ పోల్స్ తప్పని కూడా వాళ్లకు తెలుసు. బీజేపీకి 200–220 సీట్లు మాత్రమే వస్తాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రిపోర్టు ఇచ్చాయి. అయినప్పటికీ మార్కెట్ పెరుగుతుందని, స్టాక్స్ కొనాలంటూ వాళ్లిద్దరూ రిటైల్ ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు. దీన్ని బట్టి ఇదంతా ఒక స్కామ్ అని స్పష్టంగా అర్థమవుతున్నది. ఇందులో మోదీ, అమిత్ షా ప్రత్యక్ష ప్రమేయం ఉన్నది. అందుకే దీనిపై జేపీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం” అని రాహుల్ చెప్పారు.
అదానీ ఇష్యూ కంటే పెద్దది..
ఇది అదానీ ఇష్యూ కంటే పెద్దది అని రాహుల్ అన్నారు. ‘‘ఇది అదానీ ఇష్యూతో కనెక్ట్ అయి ఉంటుంది. కానీ, అంతకంటే చాలా పెద్దది. ఇందులో డైరె క్టుగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రమేయం ఉంది. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. ప్రధాని గతంలో ఎప్పుడూ స్టాక్ మార్కెట్ గురించి కామెంట్ చేయలేదు. కానీ, ఈ ఎన్నికల టైమ్ లో మొదటిసారి మార్కెట్‌పై మాట్లాడారు. అదే పనిగా మార్కెట్ పెరుగుతుందని పదే పదే కామెంట్లు చేశారు. ఆయన తర్వాత బీజేపీ పెద్దలు కొంతమంది ఇదే విషయం చెప్పారు” అని రాహుల్ పేర్కొన్నారు.