న్యూఢిల్లీ: కుమ్మరి కుటుంబం, పెయింటర్లతో కలిసి రాహుల్ గాంధీ దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తన బంగ్లాకు పెయింట్ వేస్తున్న కార్మికులతో ఆయన మాట్లాడారు. మేనల్లుడు రేహాన్ రాజీవ్ వాద్రాతో కలిసి గోడలకు ఉన్న పెచ్చులు తీస్తూ.. పెయింటింగ్ వేశారు. కుండలు తయారు చేస్తున్న కుమ్మరి కుటుంబాన్ని రాహుల్ పలకరించారు. స్వయంగా ఆయనే కుండలు తయారు చేశారు. వాళ్లతో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో రాహుల్ పోస్టు చేశారు.
‘‘ఇండియాను ప్రకాశవంతం చేసే వారితో దీపావళి’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రజల ఇండ్లల్లో వెలుగులు నింపే వారి గురించి మాట్లాడేవాళ్లు చాలా తక్కువగా ఉంటారని రేహాన్ రాజీవ్ వాద్రాతో రాహుల్ అన్నారు. అందుకే వారిని కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నట్లు వివరించారు. ‘‘ఈ దీపావళి ఎప్పటికీ గుర్తుండిపోతది. స్పెషల్ వ్యక్తులతో పండుగను సెలబ్రేట్ చేసుకున్న. పెయింటర్ బ్రదర్స్‌తో కలిసి పనిచేశాను. కుమ్మరి కుటుంబంతో కలిసి దీపాలు తయారు చేశాను. వారి నైపుణ్యం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించాను’’ అని రాహుల్ తెలిపారు.