ద్వేషంతో ఏం సాధించలేం .. రాజకీయాల్లో ప్రేమను పంచండి: రాహుల్ గాంధీ

ద్వేషంతో ఏం సాధించలేం .. రాజకీయాల్లో ప్రేమను పంచండి: రాహుల్ గాంధీ
  • రాజ్యాంగాన్ని రక్షించేందుకు పోరాడాలని పిలుపు
  • నాన్న హంతకురాలిని ప్రియాంక కౌగిలించుకున్నది
  • అలాంటి చెల్లి ఉండటం అదృష్టం

వయనాడ్ (కేరళ): రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం జరుగుతున్నదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని కోపంతోనో.. ద్వేషంతోనో.. రాయలేదని, వినయం, ప్రేమతో రాశారని తెలిపారు. దాన్ని రక్షించాల్సిన బాధ్యత దేశ ప్రజలందరిపై ఉందన్నారు. ద్వేషంతో ఏం సాధించలేమని.. అందరితో ప్రేమను పంచుకోవాలని అన్నారు. తాము పొందుతున్న రక్షణ, దేశానికి లభించిన గౌరవం అన్నీ రాజ్యాంగం నుంచే వచ్చాయన్నారు.

వయనాడ్ లోక్​సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీకి మద్దతుగా రాహుల్ ఆదివారం ప్రచారం చేశారు. మనంతవడిలో ఏర్పాటు చేసిన కార్నర్‌‌ మీటింగ్‌‌లో ఆయన మాట్లాడారు. ‘‘దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వాళ్లతో పోరాడినవాళ్లు.. కష్టనష్టాలు చూసినవాళ్లు.. జైలు జీవితం గడిపినవాళ్లు.. భవిష్యత్ తరాల గురించి ఆలోచించి రాజ్యాంగాన్ని ప్రేమతో.. వినయంతో రాశారు. వయనాడ్​లో ప్రేమ, ద్వేషానికి మధ్య పోరాటం జరుగుతున్నది. మీరంతా నిజంగా ఈ పోరాటంలో గెలవాలనుకుంటే.. మీ గుండెల్లో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని తీసేయండి. వాటి స్థానంలో ప్రేమ, వినయం, కరుణ, ఆప్యాయతను చేర్చండి’’ అని రాహుల్ గాంధీ వయనాడ్ ఓటర్లను కోరారు.

ద్వేషపూరిత రాజకీయాలు వద్దు

ప్రియాంకతో ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలను ఆయన గుర్తు చేశారు. ‘‘నన్ను, నా తల్లిదండ్రులను గెలిపించాలని ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రచారాల్లో ఓటర్లను కోరాను. కానీ..  నా చెల్లె ప్రియాంక గాంధీకి ఓటేయాలని రిక్వెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. మా తండ్రి రాజీవ్ గాంధీని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన (నళిని) వ్యక్తిని ప్రియాంక గాంధీ కౌగిలించుకున్నది.

ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి ఎంతో ఏడ్చించి. అప్పుడు ఆమెను (నళిని) చూస్తే బాధేసిందని కూడా చెప్పింది. ప్రియాంకను చెల్లెగా పొందడం నా అదృష్టం. మా కుటుంబంలో ఇలాంటి శిక్షణ మేము పొందినం. అందుకే.. మనకు కావాల్సింది ద్వేషపూరిత రాజకీయాలు కాదు.. ప్రేమ, ఆప్యాయతతో కూడిన రాజకీయాలు..’’ అని రాహుల్ చెప్పారు.