కులగణనతోనే అసమానతలు బయటవడ్తయ్: రాహుల్

కులగణనతోనే అసమానతలు బయటవడ్తయ్: రాహుల్
  • నిజాలు బయటకు రావొద్దనే కొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నరు
  • విద్యావ్యవస్థలో అట్టడుగు వర్గాలకు ఇప్పటికీ అన్యాయం 
  • దేశ వనరులు అందరికీ సమానంగా పంచాలన్న అంబేద్కర్ కల ఇప్పటికీ నెరవేరలేదు 
  • దాన్ని సాకారం చేసేందుకే కాంగ్రెస్ పోరాడుతున్నదని వెల్లడి 
  • యూజీసీ మాజీ చైర్మన్ సుఖ్‌‌‌‌దేవ్ థోరట్‌‌‌‌తో జరిగిన తన ఇంటర్వ్యూ వీడియో రిలీజ్

న్యూఢిల్లీ:  ​దేశంలోని విద్యావ్యవస్థలో ఇప్పటికీ అట్టడుగు వర్గాలవారికి అన్యాయం జరుగుతున్నదని కాంగ్రెస్​ ఎంపీ, లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ అన్నారు. అసమానత్వం, వివక్షపై నిజానిజాలు బయటపడాలంటే కులగణన అనేది కీలకమైన ముందడుగు అవుతుందని తెలిపారు. దీన్ని వ్యతిరేకిస్తున్నవారు మాత్రం వాస్తవాలు బయటకురావొద్దని కోరుకుంటున్నారని బీజేపీపై పరోక్ష విమర్శలు చేశారు.  

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మాజీ చైర్మన్, విద్యావేత్త సుఖ్‌‌దేవ్ థోరట్‌‌తో తన ఇంటర్వ్యూ వీడియోను రాహుల్​గాంధీ ‘ఎక్స్’లో పోస్ట్​ చేశారు. దేశంలోని వనరులన్నీ అందరికీ సమానంగా పంపిణీ జరగాలనే అంబేద్కర్​ కల ఇప్పటికీ నెరవేరలేదని, దాని సాకారం కోసం కాంగ్రెస్​ పోరాడుతుందని చెప్పారు. 

సమానత్వం, గౌరవం కోసం పోరాటం

తాను ప్రొఫెసర్​ థోరట్​తో సమగ్రమైన చర్చ జరిపానని రాహుల్​గాంధీ తెలిపారు. మహద్​ సత్యాగ్రహం, ఎడ్యుకేషన్​, అడ్మినిస్ట్రేషన్​, బ్యూరోక్రసీపై మాట్లాడినట్టు చెప్పారు. వనరుల విషయంలో దళితులు జరుపుతున్న పోరాటంపైనా డిస్కస్​ చేసినట్టు తెలిపారు. ఎడ్యుకేషన్, బ్యూరోక్రసీలో దళితులు, ఎస్టీలు, ఓబీసీలకు న్యాయం జరుగుతున్నది అని ఎవరైనా అంటే అది అబద్ధపు మాటలేనని అన్నారు. 

సమానత్వం, గౌరవానికి సంబంధించిన పోరాటం 98 ఏండ్ల క్రితం మొదలైందని, ఇది ఇప్పటికీ కొనసాగుతున్నదని అన్నారు. దీనిపై పూర్తి శక్తియుక్తులతో అంతా కలిసి పోరాడాలని రాహుల్ పిలుపునిచ్చారు. అయితే, రాహుల్​ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆయన చేసిన కామెంట్స్​ కాంగ్రెస్ పార్టీ ఆశ్రిత పక్షపాతం, ఫ్యూడల్ మనస్తత్వాన్ని చాటుతున్నాయని బీజేపీ నేత సీఆర్ కేశవన్ అన్నారు. ప్రజాజీవితంలో కఠోర శ్రమతో ఎంతో పేరు తెచ్చుకున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నేతలను నిరంతరం 
అవమానపరచే చరిత్ర కాంగ్రెస్‌‌దని విమర్శించారు.