- రాజ్యాంగ రక్షణకు మేం కృషిచేస్తున్నం.. డస్ట్ బిన్లో వేయాలని బీజేపీ యత్నిస్తోంది
- దేశంలో కుల గణన జరగాల్సిందే..
- రిజర్వేషన్‌పై సీలింగ్‌ను ఎత్తేస్తాం
- మోదీ 56 ఇంచుల ఛాతీకి తాను భయపడబోనని కామెంట్
మహగామా (జార్ఖండ్): ప్రధాని నరేంద్ర మోదీ పేదల ప్రయోజనాలను ఫణంగా పెట్టి బిలియనీర్ల సేవలో తరిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ విమర్శించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి పోరాడుతుంటే.. దాన్ని చెత్తబుట్టలో వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని అన్నారు. శుక్రవారం జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల సభలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. ‘‘రాహుల్‌గాంధీ రెడ్‌బుక్ చూపెడుతున్నారని ప్రధాని మోదీ పదే పదే అంటున్నారు. దాని కలర్ ముఖ్యం కాదు. అందులో ఉన్న కంటెంట్ ముఖ్యం.
దాన్ని మీరు చదివి ఉంటే, విద్వేషం వ్యాప్తి, సమాజాన్ని విభజించే ప్రయత్నం చేయరు” అని చురకలంటించారు. ఇది ప్రతిపక్ష కూటమి (ఇండియా), బీజేపీ–ఆర్ఎస్ఎస్ మధ్య జరుగుతున్న పోరాటమని వ్యాఖ్యానించారు. తాము రాజ్యాంగ విలువలను కాపాడేందుకు పోరాడుతుంటే.. కులం, మతం ఆధారంగా విద్వేషాలతో సమాజాన్ని విభజించేందుకు వారు (బీజేపీ) ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
బిలియనీర్లు చెప్పినట్టే మోదీ వింటారు
తాను మోదీ 56 ఇంచుల చాతీకి భయపడబోనని రాహుల్‌గాంధీ అన్నారు. ‘‘బిలియనీర్ల చేతిలో మోదీ ఓ తోలుబొమ్మ. ఆయన వారు చెప్పినట్టే వింటారు. పగటిపూట పేదల గురించి మాట్లాడుతారు.. రాత్రిపూట పారిశ్రామికవేత్తలు, బిలియనీర్ల వివాహాలు, ఫంక్షన్లకు హాజరవుతారు” అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాల్సిన అవసరముందని, ఇది దేశ ముఖచిత్రాన్నే మారుస్తుందని చెప్పారు. ఇది పూర్తయితే వివిధ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల స్థానమేంటో తేలిపోతుందని అన్నారు. రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50% సీలింగ్‌ను తొలగించి తీరుతామని చెప్పారు.
పేదలపై ప్రేమ, గౌరవం ఉన్నదని చెప్తున్న మోదీ.. వ్యవసాయ రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. మీరు ఎన్నుకున్న గిరిజన సీఎం(హేమంత్ సోరెన్) ను కూడా బీజేపీ లక్ష్యంగా చేసుకున్నదని, ఆయనను కటకటాల్లోకి నెట్టిందని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రేమ, ద్వేషాన్ని వ్యాంపింపజేస్తున్నదని, దాన్ని ప్రేమతో తొలగించొచ్చని రాహుల్ గాంధీ అన్నారు.
హెలికాప్టర్ టేకాఫ్ లేట్..
రాహుల్ గాంధీ హెలికాప్టర్ టేకాఫ్ లేట్ కావడం వివాదాస్పదంగా మారింది. ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో రాహుల్ గాంధీ 45 నిమిషాల పాటు వేచిచూడక తప్పలేదు. కాగా, రాహుల్ షెడ్యూల్‌కు అంతరాయం కలిగించేందుకే ఇలా టేకాఫ్‌ని ఆలస్యం చేసినట్టు కాంగ్రెస్ ఆరోపించింది.
ఏటీసీ నిర్ణయం పీఎం మోదీ ఈవెంట్లకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నదని మండిపడింది. దేశాన్ని కాంగ్రెస్ 70 ఏండ్లు పాలించిందని, ఇలాంటి ఘటన ఏ ప్రతిపక్ష నాయకుడికీ ఎదురుకాలేదని చెప్పింది. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని తెలిపింది. దీనిపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.