- రాజ్యాంగాన్ని మన దేశ డీఎన్‌ఏగా భావిస్తున్నామని వెల్లడి
- మహారాష్ట్రలోని అమరావతి బహిరంగ సభలో ప్రసంగం
ముంబై: అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ లెక్క ప్రధాని నరేంద్ర మోదీకి కూడా మతిమరుపు వచ్చినట్టుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు. బహిరంగ సభల్లో తాము ఏది చెబితే మోదీ అదే చెబుతున్నారని అన్నారు. రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కుల గణన జరపాలని.. 50% రిజర్వేషన్ పరిమితిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్.. శనివారం అమరావతిలో పర్యటించారు.
అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలు విపక్ష నేతల ప్రసంగాలను పోలి ఉన్నాయని తెలిపారు. గతంలో బైడెన్ (81) పొరపాటున ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌గా పరిచయం చేసిన ఘటనను గుర్తుచేశారు. వయసురీత్యా ఇప్పుడు మోదీకీ కూడా బైడెన్‌లా జ్ఞాపకశక్తి తగ్గుతున్నదని ఎద్దేవా చేశారు."ఇటీవల మోదీజీ స్పీచ్ విన్నట్లు మా చెల్లి చెప్పింది. సభల్లో మనం ఏం చెబుతున్నామో అదే మోదీ చెబుతున్నారని గుర్తించినట్లు తెలిపింది.
బైడెన్‌లా మోదీకీ జ్ఞాపక శక్తి తగ్గుతున్నదేమోనని నా చెల్లికి నేను చెప్పాను. ఎందుకంటే.. రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందని ఏడాదిగా నేను చెబుతున్నాను. కానీ, ఇప్పుడు రాజ్యాంగంపై కాంగ్రెస్సే దాడి చేస్తోందని ప్రధాని మోదీ చెబుతున్నారు. బీజేపీ పట్ల ప్రజలు కోపంతో ఉన్నారని ప్రధాని గ్రహించారు. అందుకే ఆయన నేను రాజ్యాంగంపై దాడి చేస్తున్నానని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కులగణనకు,50 శాతం రిజర్వేషన్ల పరిమితి రద్దుకు కాంగ్రెస్, ఇండియా కూటమి కట్టుబడి ఉంది. ఇప్పుడు నేను కులగణన చేయాలని అడిగాను కాబట్టి.. బీజేపీ నిర్వహించే తర్వాతి సభలో రాహుల్ కుల గణనకు వ్యతిరేకమని మోదీ చెబుతారు" అని రాహుల్ పేర్కొన్నారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు రాజ్యాంగం ఖాళీ పుస్తకం
రాజ్యాంగాన్ని మన దేశ డీఎన్‌ఏగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తుండగా.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు మాత్రం అది ఓ ఖాళీ పుస్తకమని రాహుల్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను కూల్చాలని రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదన్నారు. బడా పారిశ్రామిక వేత్తల రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయాలని కూడా చెప్పలేదన్నారు. రైతులను, చిరు వ్యాపారులకు నోట్ల రద్దు, జీఎస్టీతో భారీ నష్టం వాటిల్లిందన్నారు. దేశ సంపద అంతా కొందరు బిలియనీర్ల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. పారిశ్రామికవేత్తలు మాత్రమే మోదీని ప్రధానిగా ఎన్నుకోలేదని, ప్రజలంతా ఓటు వేసి ఆయనను ఆ పదవిలో కూర్చోబెట్టారని రాహుల్ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ బ్యాగ్ తనిఖీ
ప్రచారం కోసం శనివారం మధ్యాహ్నం రాహుల్ హెలికాప్టర్ అమరావతిలోని ధమన్‌గావ్ రైల్వే ఏరియాలో ల్యాండ్ అవ్వగానే ఆయనకు ఎన్నికల అధికారులు ఎదురొచ్చారు. రాహుల్ తన వెంట తెచ్చుకున్న బ్యాగులతో పాటు హెలికాప్టర్ ను క్షుణ్ణంగా తనిఖీ చేసారు. తనిఖీల సమయంలో రాహుల్, తన పార్టీ నేతలతో మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు.