- కేంద్రం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల బొటన వేళ్లు నరుకుతున్నదని ఫైర్
న్యూఢిల్లీ: రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తీసుకురావాలని హిందూత్వ సిద్ధాంత కర్త వీడీ సావర్కర్ అన్నారని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగంలో భారతీయత లేదంటూ సావర్కర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. శనివారం లోక్ సభలో రాజ్యాంగంపై రెండు రోజుల చర్చ ముగింపు సందర్భంగా రాహుల్ మాట్లాడారు. ఒక చేతిలో రాజ్యాంగం, మరో చేతిలో మనుస్మృతి పట్టుకుని.. ఆ రెండింటి మధ్య తేడాను వివరించారు. సావర్కర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై విమర్శలు గుప్పించారు.
‘‘రాజ్యాంగంలో భారతీయత లేదు. ఇది చాలా దారుణం. మనది హిందూత్వ దేశం. మనకు వేదాల తర్వాత మనుస్మృతి ముఖ్యమైనది. ఎన్నో శతాబ్దాల సంస్కృతీ సంప్రదాయాలు, విధివిధానాలన్నీ ఇందులో ఉన్నాయి. ఈ రోజు మనుస్మృతే మనకు చట్టం” అని సావర్కర్ అన్నారని రాహుల్ పేర్కొన్నారు. ‘‘రాజ్యాం స్థానంలో మనుస్మృతిని తీసుకురావాలని సావర్కర్ స్పష్టంగా చెప్పారు. మీ సుప్రీం లీడర్ (సావర్కర్) రాజ్యాంగాన్ని విమర్శిస్తే, మీరు (బీజేపీ) లోక్ సభలో రాజ్యాంగ రక్షణ అంటున్నారు. అంటే.. మీ లీడర్ మాటలకు మీరు కట్టుబడి ఉండరా? ఆయనకు మద్దతు ఇవ్వరా? మీరు సావర్కర్ ను అవమానిస్తున్నారు.
అవహేళన చేస్తున్నారు” అని బీజేపీ నేతలను ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి పార్టీలు రాజ్యాంగ రక్షకులైతే.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మనుస్మృతి మద్దతుదారులు అని అన్నారు. రాజ్యాంగం పేదలకు రక్షణగా ఉంటే, బీజేపీ దానిపై 24 గంటలూ దాడి చేస్తున్నదని మండిపడ్డారు. రాజ్యాంగం ఆధునిక భారతదేశ డాక్యుమెంట్ అయినప్పటికీ, అందులో ప్రాచీన భారతదేశ విలువలు ఉన్నాయన్నారు. హత్రాస్, సంభాల్ ఘటనలను ప్రస్తావిస్తూ బీజేపీపై రాహుల్ మండిపడ్డారు. ‘‘హత్రాస్ లో గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబం తాళం వేసుకుని ఇంట్లో ఉంటే, నిందితుడు దర్జాగా బయట తిరుగుతున్నాడు. ఇలా రాజ్యాంగంలో లేదు.. బీజేపీ రాజ్యాంగంలోనే రాసి ఉంది” అని ఫైర్ అయ్యారు. బాధితురాలి కుటుంబాన్ని మరో ప్రాంతానికి షిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తామే వేరే చోట ఆశ్రయం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
బీజేపీ అన్ని వర్గాల బొటన వేళ్లను కోసేస్తున్నది..
ప్రస్తుతం దేశంలో యుద్ధం జరుగుతున్నదని రాహుల్ అన్నారు. గురువు ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు తన బొటన వేలును గురుదక్షిణగా ఇచ్చిన కథను ప్రస్తావించారు. ‘‘మీరు (ప్రధాని మోదీ) ధారావిని అదానీకి అప్పగించి.. అక్కడి చిరు వ్యాపారుల బొటన వేళ్లను కోశారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు కూడా అప్పగిస్తూ అలాగే చేస్తున్నారు.
అగ్నివీర్ స్కీమ్, పేపర్ లీకేజీలతో యువత, మద్దతు ధర కోసం కొట్లాడుతుంటే టియర్ గ్యాస్ ప్రయోగించి రైతుల, లేటరల్ ఎంట్రీ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల బొటన వేళ్లను కోసేశారు” అని విమర్శించారు. కులగణన, రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. వీటి ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామని చెప్పారు.
రాజ్యాంగంలో భారతీయత ఏమీ లేదని, దాని స్థానంలో మనుస్మృతిని తీసుకురావాలని సావర్కర్ స్పష్టంగా చెప్పారు. అదే తీరుగా బీజేపీ వ్యవహరిస్తున్నది. 24 గంటలూ రాజ్యాంగంపై దాడి చేస్తున్నది. కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలు రాజ్యాంగ రక్షకులైతే.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మనుస్మృతి మద్దతుదారులు.
మీరు (ప్రధాని మోదీ) ధారావిని అదానీకి అప్పగించి.. అక్కడి చిరు వ్యాపారుల బొటన వేళ్లను నరికేశారు. అగ్నివీర్ స్కీమ్, పేపర్ లీకేజీలతో యువత, మద్దతు ధర కోసం కొట్లాడుతుంటే టియర్ గ్యాస్ ప్రయోగించి రైతుల, లేటరల్ ఎంట్రీ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల బొటన వేళ్లను నరికేశారు.