ప్రతి మహిళకు నెల నెలా 2 వేలు .. కర్నాటకలో గృహలక్ష్మీ స్కీమ్ ప్రారంభం

ప్రతి మహిళకు నెల నెలా 2 వేలు .. కర్నాటకలో గృహలక్ష్మీ స్కీమ్ ప్రారంభం
  • కర్నాటకలో గృహలక్ష్మి స్కీమ్​ను ప్రారంభించిన రాహుల్ గాంధీ
  • అబద్ధపు హామీలు ఇవ్వం.. చేసేదే చెప్తం
  • గృహలక్ష్మి​తో 1.10 కోట్ల మందికి లబ్ధి
  • ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తామని వెల్లడి

మైసూర్(కర్నాటక) / న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నేరవేస్తోందని ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. మహిళా సాధికారతే తమ లక్ష్యమని, తాము అబద్ధపు వాగ్ధానాలు చేయబోమని, చేసేదే చెప్తామని స్పష్టంచేశారు. కర్నాటకలో సిద్ధ రామయ్య నేతృత్వంలోని ప్రభుత్వంచేస్తున్న అభివృద్ధి దేశమే ఆచరించేలా ఉందని కొనియాడారు. ఎన్నికల హామీల్లో ఒకటైన గృహలక్ష్మి స్కీమ్​ను ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ మైసూర్​లోని మహారాజా కాలేజ్ గ్రౌండ్​లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. ‘‘గృహలక్ష్మి స్కీమ్ కింద ప్రతి మహిళ అకౌంట్​లో నెలనెలా రూ.2 వేలు జమ అవుతాయి. ఈ స్కీమ్ కింద 1.10 కోట్ల మంది మహిళలకు లబ్ది చేకూరుతుంది. అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో 5 ముఖ్యమైన హామీలు ఇచ్చాం. అందులో 4 మహిళా సాధికారతకు సంబంధించినవే’ అని రాహుల్ చెప్పారు. 

అభివృద్ధిలో మహిళలే కీలకం

శక్తి, గృహలక్ష్మి, అన్నభాగ్య, గృహజ్యోతి, యువ నిధి అనేవి ఐదు గ్యారెంటీ స్కీమ్​లు.. ఇవి కేవలం పథకాలు మాత్రమే కావు, ప్రభుత్వ పాలనకు నిదర్శనమని రాహుల్ అన్నారు. గృహలక్ష్మి స్కీమ్ వరల్డ్ లార్జెస్ట్ క్యాష్ ట్రాన్స్​ఫర్ స్కీమ్ అని తెలిపారు. ఒక్క బటన్ నొక్కగానే 1.10 కోట్ల మంది మహిళల అకౌంట్లలో రూ.2000 చొప్పున జమ అవుతాయని వివరించారు. గృహజ్యోతి కింద ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, అన్నభాగ్య కింద 10 కేజీల బియ్యం, యువ నిధి(యూత్ ఫండ్) కింద నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు రూ.3,000, డిప్లామా హోల్డర్స్ రూ.1,500 అందజేస్తామన్నారు. చెట్టుకు వేర్లు ఎంతో కీలకమో.. కర్నాటక అభివృద్ధికి మహిళలు అంతే కీలకమని వివరించారు. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా చెట్టు ధైర్యంగా నిలబడటానికి వేర్లే కారణమన్నారు. తాము మహిళలకు అంత ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. 

కర్నాటక స్కీమ్స్.. పార్టీకి స్ఫూర్తి

మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ స్కీమ్​లు అమలు చేస్తున్నామని రాహుల్ వివరించారు. ఈ పథకాలు పార్టీకి ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. తమ ప్రభుత్వం పేదవాళ్ల సంక్షేమం కోసం పనిచేస్తుండగా బీజేపీ సర్కారు కేవలం బిలియనీర్ల కోసమే పనిచేస్తోందని విమర్శించారు. తర్వాత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. గృహలక్ష్మి లాంటి స్కీమ్ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలేదన్నారు. ఐదు గ్యారెంటీ స్కీమ్స్​లో ఇప్పటికే శక్తి, గృహజ్యోతి, అన్నభాగ్య స్కీమ్స్ అమలు చేస్తున్నామని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను గృహలక్ష్మి స్కీమ్ కోసం రూ.17,500 కోట్లు కేటాయించామని వివరించారు. 

చైనా మ్యాప్​పై మోదీ మాట్లాడాలి: రాహుల్

చైనా మ్యాప్ ఇష్యూ చాలా సీరియస్ అంశమని రాహుల్ అన్నారు. దీనిపై ప్రధాని మోదీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. అరుణాచల్​ప్రదేశ్, ఆక్సాయ్​చిన్ తమ దేశంలోని భూభాగాలని చైనా ప్రకటిస్తే మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. లడఖ్​లోని కొంత భూభాగం చైనా ఇప్పటికే స్వాధీనం చేసుకుందని విమర్శించారు.

బీజేపీ కల ఎప్పటికీ నిజం కాదు: ప్రియాంక గాంధీ

రాహుల్‌‌‌‌ గాంధీకి, తనకు మధ్య గొడవలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్‌‌‌‌ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. తమపై బీజేపీ బూటకపు ప్రచారం చేస్తోందని, దానిని తిప్పికొడతామని బుధవారం ట్వీట్​ చేశారు. ‘‘బీజేపీ నేతలు దేశంలో ప్రస్తుతం ఉన్న ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌, నిరుద్యోగం గురించి వదిలేసి అనవసరమైన విషయాలపై మాట్లాడుతున్నారు. ఇది మీ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. అయితే, మీరు కన్న కల ఎప్పటికీ నిజం కాదు. నేను, నా బ్రదర్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌ ఇద్దరం ఒకరికొకరం ప్రేమ, నమ్మకం, రెస్పెక్ట్‌‌‌‌, విధేయత కలిగి ఉంటాం. 

మీరు చింతించకండి. దేశంలో ఉన్న లక్షల మంది సోదర సోదరీమణులతో కలిసి మీరు ఆడుతున్న అబద్ధాలు, దోపిడీని, బూటకపు ప్రచారాలను తిప్పికొడతాం”అని ప్రియాంక పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రియాంక గాంధీ రక్షా బంధన్‌‌‌‌ శుభాకాంక్షలు చెప్పారు. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన ‘గృహ లక్ష్మి’ కార్యక్రమంలో రాహుల్‌‌‌‌ గాంధీకి ప్రియాంక రాఖీ కట్టారు. కాగా, రాహుల్‌‌‌‌, ప్రియాంక మధ్య రాజకీయ గొడవలు జరుగుతున్నాయని బీజేపీ ఐటీ సెల్​ హెడ్ అమిత్ మాలవీయా ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా షేర్ చేయడంతో ప్రియాంక స్పందించారు.