తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతోంది. ఉమ్మడి కరీంనగర్లో రాహుల్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అక్టోబర్ 20న జగిత్యాలలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా మాల్యాల మీదుగా వెళ్లిన రాహుల్ మండలంలోని వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఆగి టిఫిన్ చేశారు. కాసేపు చిన్నారులతో కాలక్షేపం చేసి వారికి చాక్లెట్స్ ఇచ్చారు అటుగా వెళ్తున్న ప్రయాణికులతో ముచ్చటించారు.
అలాగే కరీంనగర్- జగిత్యాల ప్రధాన రహదారిపై ఉన్న శ్రీ వెంకటేశ్వర ఫుడ్ ట్రక్ బండి దగ్గరకు వెళ్లి కాసేపు దోశలు వేశారు రాహుల్. ఇద్దరు కస్టమర్లకు కూడా రాహుల్ దోశ వేసి ఇచ్చారు. ఆయన వెంట రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కి, శ్రీధర్ బాబు, తదితరులు ఉన్నారు. ఇది ఇలా ఉండగా, దోస రుచి చూసిన రాహుల్ బాగుందనడంతో ఫుడ్ ట్రక్ ఓనర్ సంతోషం వ్యక్తం చేశారు.
రాహుల్ కొండగట్టు పర్యటన రద్దు
ఇప్పటికే రెండు రోజులు బస్సు యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. మూడో రోజైన 2023, అక్టోబర్ 20వ తేదీన శుక్రవారం రాహుల్ పర్యటన షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేశారు. రాహుల్ గాంధీ.. కొండగట్టు, గంగాధర ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉండగా.. చివరి నిమిషయంలో ఆ రెండు ప్రాంతాల్లో కార్నర్ మీటింగ్స్ రద్దు చేశారు. దీంతో రాహుల్ గాంధీ నేరుగా జగిత్యాల, కోరుట్లలో పర్యటించి ఆర్మూరు సభకు వెళ్లనున్నారు. అనంతరం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుని ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు