గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి షాక్..

గుజరాత్ హైకోర్టులో రాహుల్​గాంధీకి  షాక్​ తగిలింది. పరువు నష్టం దావా కేసులో ఆయనకు  పడిన రెండేళ్ల శిక్షపై  స్టే విధించాలని వేసిన పిటిషన్​ను గుజరాత్​ హైకోర్టు కొట్టివేసింది.  సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సూరత్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. రాహుల్ గాంధీ దోషి అని ఇచ్చిన తీర్పు అమలును నిలిపేసేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. దీంతో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. 

 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్ గాంధీ ర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ.. దొంగలందరి ఇంటిపేరు మోదీయే  ఎందుకంటూ..అక్కడి ప్రజలను ప్రశ్నించారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అభ్యంతం వ్యక్తం చేసిన గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ .. సూరత్‌ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు.  దీనిపై విచారించిన సూరత్  కోర్టు.... రాహుల్‌ గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని రాహుల్‌ గాంధీ తన వాదనను వినిపించారు. అయితే పూర్తిస్థాయి విచారణ అనంతరం కోర్టు.... 2023 మార్చి 23న రాహుల్ గాంధీని  దోషిగా తేల్చుతూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

2023 మార్చి 24న   రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు అయింది.  దోషిగా నిర్థారణ అయిన వ్యక్తి చట్టసభల సభ్యునిగా కొనసాగడానికి చట్టం అంగీకరించదని లోక్ సభ కార్యదర్శి పేర్కొన్నారు. దీంతో సూరత్ సెషన్  కోర్టు తీర్పు అమలును నిలుపుదల చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న తిరస్కరించింది. దీంతో రాహుల్ గాంధీ  ఏప్రిల్ 25న గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే తాజాగా గుజరాత్ హైకోర్టు కూడా సూరత్ కోర్టు తీర్పు అమలుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.