గీత దాటితే వేటు తప్పదు.. గుజరాత్​లో కాంగ్రెస్​ నేతలకు రాహుల్​ గాంధీ వార్నింగ్

గీత దాటితే వేటు తప్పదు..  గుజరాత్​లో కాంగ్రెస్​ నేతలకు రాహుల్​ గాంధీ వార్నింగ్
  • తెలంగాణలో మాదిరి ఓట్​ షేర్​ పెంచుకోవాలని సూచన

అహ్మదాబాద్: పార్టీ గీత దాటితే చర్యలు తప్పవని గుజరాత్​ కాంగ్రెస్​ నేతలకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్​  గాంధీ తేల్చిచెప్పారు. పార్టీ కోసం కష్టపడేవాళ్లకు గుర్తింపు ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్​లోనే ఉండి పక్క పార్టీకి ముఖ్యంగా బీజేపీకి కొందరు పనిచేస్తున్నారని, అలాంటి వారిపై వేటు వేస్తామన్నారు. రెండురోజుల గుజరాత్​ పర్యటనలో భాగంగా రెండోరోజు శనివారం అహ్మదాబాద్​లో కాంగ్రెస్​ కేడర్​ మీటింగ్​లో రాహుల్​ గాంధీ మాట్లాడారు. ‘‘గుజరాత్​ కాంగ్రెస్​ పార్టీలో రెండు రకాల వాళ్లు ఉన్నరు. 

మొదటి రకం.. పార్టీని, పార్టీ సిద్ధాంతాన్ని గుండెల్లో పెట్టుకొని, పార్టీ కోసం కష్టపడేవాళ్లు. ఇక రెండో రకం వాళ్లు.. పేరుకు పార్టీలోనే ఉన్నా జనంలో మాత్రం తిరగరు. గౌరవం కూడా ఇవ్వరు. పార్టీ గురించి పట్టించుకోరు. వీరిలో సగం మంది వరకు బీజేపీకి పనిచేస్తుంటరు. ఇలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే. పార్టీలో ఫిల్టరింగ్​ అవసరం’’ అని పేర్కొన్నారు.  పార్టీ హద్దులు దాటుతున్న గుజరాత్​లోని ముప్పై, నలభై మంది నాయకులను తీసివేయాల్సి ఉంటుందన్నారు. ఏప్రిల్​లో ఏఐసీసీ సమావేశాలు కూడా గుజరాత్​లోని అహ్మదాబాద్​లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నేతలతో రాహుల్​ సమావేశాలు ఏర్పాటు చేశారు.

మనం చేసే పనే ముందుకు నడిపిస్తుంది

గుజరాత్​లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే ముందుగా మన బాధ్యతలు మనం నిర్వర్తించాలని కాంగ్రెస్​ కేడర్​కు రాహుల్​గాంధీ సూచించారు. గుజరాత్​లో మూడున్నర దశాబ్దాల నుంచి కాంగ్రెస్​ పార్టీ అధికారంలో లేదని, తిరిగి అధికారంలోకి రావాలంటే ప్రతి కార్యకర్త, నాయకుడు కష్టపడాలని.. ప్రజల వెంట ఉండాలని చెప్పారు. కాంగ్రెస్​ పార్టీకి బూత్​ లెవల్​ కూడా లీడర్లకు కొరత లేదని.. కానీ, వారిని కొందరు సంకెళ్లతో బంధించారని వ్యాఖ్యానించారు. 

ఆ సంకెళ్లను తెంచి, వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ‘‘ప్రజలను మనం అధికారం అడగొద్దు. ముందు మనం ఏం చేస్తున్నామో చెక్​ చేసుకోవాలి. మన బాధ్యతలు మనం నిర్వర్తించడంపై ఫోకస్​ పెట్టాలి. జనం సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. మనం నిర్వర్తించే బాధ్యతలను బట్టే జనం మనకు అవకాశాలు ఇస్తారు” అని హితబోధ చేశారు.

5శాతం ఓటు షేర్​ పెంచుకుంటే చాలు..

గుజరాత్​లో ఇన్నేండ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడి ప్రజలకు చేసిందేమిటని రాహుల్​గాంధీ ప్రశ్నించారు. స్థానిక రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గుజరాత్​లో కాంగ్రెస్​ అధికారంలోకి రావాలంటే తెలంగాణ మాదిరి ప్రణాళికతో ముందుకు నడవాలని పార్టీ నేతలకు రాహుల్ సూచించారు. 

ముందు పార్టీ ఓటు షేర్​ పెంచుకోవడంపై ఫోకస్​ పెట్టాలన్నారు. గుజరాత్​లో ప్రస్తుతం ప్రతిపక్షానికి 40 శాతం ఓటు షేర్​ ఉందని, మరో 5 శాతం పెంచుకోగలిగితే అధికారంలోకి రాగలమని చెప్పారు. తెలంగాణలో  పార్టీ ఓటు షేర్​ను 22 శాతం పెంచుకోగలిగామన్నారు.