అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(నవంబర్ 1) నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లెల్ల గ్రామంలో 4 ఏండ్ల క్రితం రూ.8 లక్షల అప్పు తీర్చే మార్గం లేక పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడిన కౌలు రైతు కుమ్మరి చంద్రయ్య (35) నివాసానికి వెళ్లి.. బాధిత కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించారు.
భార్య తిరుపతమ్మ, కొడుకు నితిన్, కూతురు శ్రావణితో మాట్లాడి ఓదార్చారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ వెంట మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, వంశీ చందర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.