జైపూర్: రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ బంద్ పెట్టి, బిలియనీర్లకు దోచిపెడుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం రాష్ట్రంలో మూడు చోట్ల ఎన్నికల ర్యాలీల్లో ఆయన మాట్లాడారు. ‘‘రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ఓల్డ్ పెన్షన్ స్కీమ్, హెల్త్ ఇన్సూరెన్స్, గ్యాస్ సబ్సిడీ, మహిళలకు రూ.10 వేల ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తుంది. మళ్లీ బిలియనీయర్లకే దోచి పెడ్తది”అని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు, రైతులకు, చిన్న వ్యాపారస్తులకు లబ్ధి చేకూరుస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ‘‘మీకు అదానీ ప్రభుత్వం కావాలా, రైతులు, కూలీలు, యువత ప్రభుత్వం కావాలా’’ తేల్చుకోవాలని సూచించారు. మోదీ అంటే అదానీకి గ్యారంటీ.. కాంగ్రెస్ అంటే రైతులు, కూలీలు, యువకుల ప్రభుత్వం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పేదల జేబుల్లోకి డబ్బును బదిలీ చేస్తే, బీజేపీ అదానీ జేబుల్లో పెడుతుందని ఆరోపించారు.
విదేశాల్లో కంపెనీలు కొనుగోలు చేయడానికి అదానీకి బీజేపీ హెల్ప్ చేస్తుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల జేబుల్లోకి డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేస్తుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాజస్థాన్‌లో కుల గణన చేపడతామని హామీ ఇచ్చారు. మోదీ ప్రభుత్వంలో నిరుద్యోగం భారీగా పెరిగిందన్నారు. దేశం కోసం పనిచేయాలని యువత కోరుకుంటున్నదని, కానీ మోదీ ప్రభుత్వం వారి శక్తి సామర్థ్యాలను నాశనం చేస్తోందని మండిపడ్డారు. కాగా, గురువారం జైపూర్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
రాహుల్ గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ముగ్గురూ ఒకే చోట కనిపించారు. ఈ క్రమంలో ముగ్గురు నడుచుకుంటూ వస్తుండగా, ‘‘పెహ్లే ఆప్.. పెహ్లే ఆప్ (ముందు మీరు నడవండి.. ముందు మీరు నడవండి)” అంటూ గెహ్లాట్, రాహుల్ ఒకరినొకరు అడగడంతో అక్కడున్న వారు నవ్వుకున్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మీడియాతో రాహుల్ మాట్లాడుతూ, ‘‘మేమంతా ఐక్యంగాఉన్నాం. ఎప్పటికీ కలిసి ఉంటాం. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది” అని స్పష్టం చేశారు.
ALSO READ: టన్నెల్ లోనే 40 మంది .. ఐదు రోజులైనా వీడని ఉత్కంఠ
మోదీ అబద్ధాల మాస్టర్: జైరాం
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ అన్నారు. మోదీ ‘అబద్ధాల మాస్టర్’ అని ఒక ప్రకటనలో మండిపడ్డారు. రాహుల్ గాంధీని మూర్ఖుల నాయకుడు అన్న మోదీ వ్యాఖ్యలపై జైరాం రమేశ్ ఫైర్ అయ్యారు. బీజేపీ.. ‘భారతీయ జూటా పార్టీ’ అని, మోదీ ఆ పార్టీకి నాయకుడని విమర్శించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలే, రాష్ట్రంలో తమను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయన్నారు.